ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలను అప్రమత్తం చేసారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొడుతూనే..భవిష్యత్ పరిణామాల పైన జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించారు. తిరుమల వ్యవహారంలో ప్రజల్లోకి అసత్యాలు తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డిక్లరేషన్ పైన సంతకం చేయటం ఇష్టం లేగనే జగన్ తిరుమలకు వెళ్లలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నేతలతో భేటీ
ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన సీఎం చంద్రబాబుకు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిణామాల పైన చర్చించారు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ ప్రభుత్వమేదో తనని అడ్డుకున్నట్లుగా చేసిన అసత్య ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టినట్లే భవిష్యత్తు పరిణామాల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
పోలీసుల పై ఫిర్యాదు
అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసుల, అధికారులు తీరుపై సీఎం వద్ద టీడీపీ నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులు వైఎస్సార్సీపీ నేతలు అంటూనే రాజకీయ ప్రమేయం లేదనే భిన్నాభిప్రాయాలు పోలీసులు వ్యక్తం చేయటాన్ని నేతలు చంద్రబాబు వద్ద చర్చకు వచ్చింది. పోలీసులు విచారణ పూర్తి చేయకుండా రాజకీయ ప్రమేయం లేదనడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అప్రమత్తంగా ఉంటూ పొరపాట్లు లేకుండా చూసుకుందామని నేతలతో సీఎం వ్యాఖ్యానించారు.
కొలికపూడి వ్యవహారంలో
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌పై సీఎం చంద్రబాబుకు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని తెలిపారు. కొలికిపూడి తమను బెదిరిస్తూ కించపరిచిన ఆధారాలను మీడియా ప్రతినిధులు సీఎంకు అందచేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అన్ని విషయాలు తెలుసన్న సీఎం సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.