జమ్ము కాశ్మీర్ ఎన్నికల ఫలితాల పై తొలి సారి ప్రధాని మదీ స్పందించారు. ఎన్నికల ఫలితాల పైన తన అంచనాలను వెల్లడించారు. జమ్ము కాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మూడు పార్టీలు కుటుంబ పార్టీలని విమర్శించారు. జమ్ము కాశ్మీర్ లో శాంతి, మార్పు తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర భవిష్యత్ కు బీజేపీ మాత్రమే భరోసా ఇవ్వగలదని మోదీ చెప్పుకొచ్చారు.
విజయం బీజేపీదే
ప్రధాని మోదీ జమ్ములో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జమ్ము కాశ్మీర్ ప్రజలు శాంతి కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ సానుభూతి పరులతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో పాటుగా ఎన్సీ, పీడీపీ పార్టీలు రాజ్యాంగానికి శత్రువులుగా అభివర్ణించారు. జమ్ము ప్రజలు ఉగ్రవాదం, వేర్పాటు వాదం లేని ప్రభుత్వం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జమ్ము పిల్లల భవిష్యత్ కు భరోసా ఇచ్చే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని మోదీ వివరించారు.
నాడు సర్జికల్ స్ట్రైక్స్
మూడు పార్టీలతో జమ్ము కాశ్మీర్ ప్రజలు విసిగి పోయారని మోదీ విమర్శించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతానికి దూరంగా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారని ప్రధాని అన్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల విలువ కాంగ్రెస్‌కు తెలియదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సరిహద్దుల్లో కాల్పులు జరిగితే, ఆ పార్టీ తెల్ల జెండాలను ఎగురవేసిందని ఎద్దేవా చేసారు. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగిందని మోదీ గుర్తు చేసారు.
ప్రజలు బీజేపీ వైపే
2016 సెప్టెంబరు 28 రాత్రి సర్జికల్ స్ట్రైక్ జరిగిందని మోదీ వెల్లడించారు. శత్రువుల భూభాగంలోకి వెళ్లి దాడి చేయగలిగిన సరికొత్త భారత్‌ను నాడు ప్రపంచమంతా చూసిందన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో జరిగిన తొలిదశ ఎన్నికల్లో మొత్తం 61 శాతం పోలింగ్ నమోదవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. జమ్ముకశ్మీర్‌లో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. పూర్తి మెజారిటీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు.