కోల్‌కతా జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం,హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. హత్యాచారానికి గురైన వైద్యురాలి శరీరంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారు. దీంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఈ కేసులో ఒక్కడే నిందితుడని తేల్చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైనా సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కాలేజ్ ప్రిన్సిపాల్‌ను సైతం విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసింది తానే అని చెప్పిన సంజయ్ రాయ్, కోర్టులో ప్లేట్ ఫిరాయించారు. తనని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని చెప్పి అందరికి షాకిచ్చాడు.
దీంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చరనడానికి మరింత బలం చేకూరినట్లు అయింది. కేసు తీవ్రతరం కావడంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని , తనని కావాలనే పోలీసులు ఈ కేసులో ఇరికించారని సంజయ్ రాయ్ న్యాయస్థానానికి తెలిపాడు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకే తాను లైడిటెక్టర్ టెస్ట్‌కు అంగీకరించానట్టు సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. సంజయ్ రాయ్ మాట మార్చడంతో అసలు నిందితులు ఎవరనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. పోలీసులు కావాలనే అసలు నిందితులను తప్పించారనే విమర్శలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు సంజయ్ రాయ్ సైతం తానే ఎటువంటి తప్పు చేయలేదని చెప్పడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది.
ఈ కేసులో విచారణ చేపట్టిన సీబీఐ తాజాగా సంచలన విషయాలను వెల్లడించింది. ఈమేరకు వివరాలతో కూడిన నివేదికను కోల్‌కతాలోని స్పెషల్ కోర్టుకు సీబీఐ బుధవారం సమర్పించింది. కేసు రికార్డులను తారుమారు చేసిన నేపథ్యంలో తాలా పోలీసు స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేశామని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కాలేజీ సెక్యూరిటీ గార్డ్ సంజయ్ రాయ్ దుస్తులను సీజ్ చేసే విషయంలో పోలీసులు రెండు రోజుల జాప్యం చేశారు. ఒకవేళ ఆ దుస్తులను వెంటనే సీజ్ చేసి ఉంటే ఈ కేసులో కీలక సాక్ష్యంగా మారి ఉండేవి” అని న్యాయస్థానానికి సమర్పించిన రిపోర్టులో సీబీఐ తెలిపింది. తాలా పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అభిజిత్ మోండల్, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌లను కోర్టు ఎదుట సీబీఐ ప్రవేశపెట్టింది. వీరిద్దరిని కస్టడీలో విచారించగా కేసు రికార్డుల్లోని అవకతవకల సమాచారం బయటపడిందని కోర్టుకు తెలిపింది. దీంతో అభిజిత్ మోండల్, సందీప్ ఘోష్‌ల జ్యుడీషియల్ కస్టడీ గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.