కూటమిలో ఏం జరుగుతోంది? జనసేనలోకి వలసలను ప్రొత్సహిస్తున్నదెవరు? జగన్.. తన పార్టీ నేతలకు జనసేనలోకి పంపిస్తున్నారా? నేతల రాకతో జనసేనలో ఉక్కపోత మొదలైందా? గతంలోనూ వైసీపీ ఇలాంటి స్కెచ్ వేసిందా? వచ్చిన.. రానున్న నేతలతో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా మారిందా? మరి జనసేనను నమ్ముకున్న నేతల మాటేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఏపీలో రాజకీయాలు వెరైటీగా నడుస్తున్నాయి. ఉనికి కోసం పోరాటం చేస్తోంది వైసీపీ. పార్టీని బలోపేతం చేసే పనిలో జనసేన నిమగ్నమైంది. వైసీపీలో లైఫ్ ఉండదని భావించి కీలక నేతలు జనసేన వైపు వస్తున్నారా? లేక జగన్ పంపిస్తున్నారా? అనేది సెకండ్ పాయింట్. జనసేన వైపు వస్తున్న నేతలంతా టీడీపీపై ఒంటి కాలుపై లేచినవారే. దీంతో సైకిల్ వర్సెస్ గ్లాసుగా రాజకీయాలు మారుతాయన్నది నేతల ఆలోచన.
ఇప్పటికే ఒకరిద్దరు నేతలు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. బాలినేని-టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలైపోయింది. ఫ్యాన్ పార్టీ నేతలు జనసేనలోకి వచ్చినా, మా పోరాటం ఆగదన్నది దామచర్ల మాట. గడిచిన ఐదేళ్లు మా పార్టీ కార్యకర్తలు నరకం అనుభవించారన్నది ఆయన మాట.
టీడీపీతో వైరం ఉన్న నేతలే ఇప్పుడు గ్లాసు పంచన చేరుతున్నారు. ఈ లెక్కన జగన్.. వలసలను ప్రొత్సహించినట్లే కనిపిస్తోంది. 2014-19 మధ్యకాలంలో జగన్ తన పార్టీలోని కొందరు నేతలను టీడీపీలోకి పంపారు. వారి ద్వారా కీలక విషయాలు తెలుసుకుని అలర్టయ్యేవారు. 2019 ఎన్నికల తర్వాత ఆయా నేతలంతా జగన్ గూటికి చేరుకున్న విషయం తెల్సిందే. ఈ లెక్కన జగన్ టార్గెట్ అంతా పవన్ కల్యాణ్ అన్నదే స్పష్టంగా అర్థమవుతుంది.
ఇంతవరకు బాగానే ఉంది. మొదటి నుంచి జనసేనను నమ్ముకున్న నేతల మాటేంటి? ఈ విషయంలో పవన్ ఆలోచన ఎలా ఉంటుంది? వారికి న్యాయం చేస్తారా? అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలోని నేతలను సముదాయించారు పవన్ కల్యాణ్. పార్టీని బలోపేతం చేసే పనిలో వలస నేతలకు ప్రయార్టీ ఇస్తారా? పార్టీని నమ్ముకున్నవారికి ఛాన్స్ ఇస్తారా? అన్నదే అసలు ప్రశ్న.
కూటమి నామినేటెడ్ పదవుల్లో కొందరు గ్లాసు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడు కేటాయించినది కేవలం ఒకవంతు మాత్రమే కావడంతో సైలెంట్ అయ్యారట. పదవులు కేటాయింపు తర్వాత అసంతృప్త నేతలంతా బయటకు రావచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టులు-వలసల వ్యవహారం గాజు గ్లాసు పార్టీలో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.









