Search
Close this search box.

  స్కిల్ యూనివర్సిటీకి రూ. 100 కోట్లు..!

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున రూ. 100 కోట్లు కేటాయిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక, యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం కోరారు. సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీ నిర్వహణకు ఎవరికి తోచింది వారు వివిధ రూపాలలో సహకారం అందించాలని కోరారు. దేశానికే ఆదర్శంగా స్కిల్ యూనివర్సిటీని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను వర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

 

ఆనంద్ మహీంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం రేవంత్ ఆలోచన గొప్పదని కొనియాడారు. మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రశంసించారు. అందుకే తాను యూనివర్సిటీ బోర్డ్ ఛైర్మన్ గా ఉండాలని ఆయన కోరగానే అంగీకరించినట్లు ఆనంద్ మహీంద్ర తెలిపారు.

 

ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సులతోపాటు కీలక అంశాలను అధికారులు పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తోపాటు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

కాగా, రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని 57 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. వివిధ రంగాల్లో అంతర్జాతీయ పోటీని సమర్థవంతంగా ఎదుర్కొనేలా తెలంగాణ యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ సర్కారు ఏర్పాటు చేస్తోంది. ఈ యూనివర్సిటీలో వివిధ విభాగాలకు సంబంధించి 17 కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు