కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబరు 2 వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీఎం సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వడానికి సంబంధించి కసరత్తు చేశారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, సంగీత సత్యనారాయణ, మాణిక్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ పాల్గొన్నారు.
కాగా, గత పదేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్ హామి ఇచ్చింది. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమైంది. దీంతో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, కొత్త రేషన్ కార్డుల జారీపై విధి విధానాలను కసరత్తు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ, అర్బన్ఏరియాలుగా వార్షికాదాయ పరిమితిని అమలు చేస్తున్నారు. దీని ఆధారంగానే తెల్ల రేషన్ కార్డును ప్రభుత్వాలు ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్రూ.2 లక్షల్లోపు ఆదాయాన్ని కార్డుల జారీకీ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భూ విస్తీర్ణం తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలో 89.96 లక్షల మందికి రేషన్కార్డులుండగా, వాటి పరిధిలో 2.1 కోట్ల మంది సభ్యులున్నారు. వీటిలో 5.66 లక్షలు అంత్యోదయ, అన్నపూర్ణ పథకాల కింద 5,416 కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డుదారులకు 6 కిలోల బియ్యం (కేంద్రం నుంచి 5 కిలోలు, రాష్ట్రం నుంచి 1 కిలో) ఇస్తున్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇస్తుండగా.. అంత్యోదయ కార్డుదారులకు కేంద్రం 35 కిలోల బియ్యం అందజేస్తున్నాయి. కార్డుల జారీకి వార్షికాదాయాన్ని అర్హతగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామీణం, అర్బన్ ప్రాంతాలకు వేర్వేరుగా ఆదాయ పరిమితులు ఉండగా కొత్తగా జారీ చేయనున్న విధివిధానాల్లోనూ అవే కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం.