తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు దిశగా అడుగులు పడుతున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు మూడు కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని ఈఆర్సీకి ప్రతిపాదించాయి. ఆమోదం లభిస్తే రెవిన్యూ లోటును పూడ్చుకోవడానికి రూ. 1,200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ బహిరంగ విచారణ చేసిన తరువాత నిర్ణయం వెల్లడించనుంది.
తాజా ప్రతిపాదనలు
విద్యుత్ పంపిణీ సంస్థలు రెవిన్యూ లోటు భర్తీ చేసుకొనేందుకు ఛార్జీల పెంపు తప్పదని ఈఆర్సీకి నివేదికలు ఇచ్చాయి. త్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ. 14వేల 222 కోట్లుగా ఉంటుందని అంచనా వేశాయి. ఈ మొత్తంలో 13వేల 22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరాయి. మిగిలిన 1,200 కోట్ల లోటును పూడ్చుకునేందుకు ఛార్జీల సవరణ ప్రతిపాదనలను ఇస్తున్నట్లు డిస్కంలు ప్రకటించాయి.
బహిరంగ విచారణతో
ఇళ్లకు వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ప్రస్తుతం 10 వసూలు చేస్తుండగా, 50 రూపాయలకు పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. అన్ని కేటగిరీల పరిశ్రమల నుంచి యూనిట్‌కు 7రూపాయల 65 పైసల చొప్పునే వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. పరిశ్రమల నుంచి కిలోవాట్‌కు 475 చొప్పున వసూలు చేస్తున్న స్థిరఛార్జీని 500 రూపాయలకు పెంచాలని కోరుతున్నాయి. ప్రభుత్వం గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్లలోపు కరెంటు వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తోంది.
ప్రభుత్వ ఆలోచన ఏంటి
అలాగే 299 యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి స్థిరఛార్జీ పెంపు ఉండదు. రాష్ట్రంలో మొత్తం కోటీ 30 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో 300 యూనిట్లలోపు వాడుకునేవారు 80 శాతానికి పైగా ఉన్నారు. ఈ నివేదికను 2023 నవంబరు 30 కల్లా మండలికి ఇవ్వాల్సి ఉన్నా అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవ్వలేదు. 2024 జనవరి ఆఖరుకు ఇవ్వాలని ఈఆర్సీ ఆదేశించినా లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆలస్యం చేశాయి. దాంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆలస్యానికి 21 లక్షల జరిమానాను డిస్కంల నుంచి ఈఆర్సీ వసూలు చేసింది.