Search
Close this search box.

  తుడిచిపెట్టుకు పోయిన గ్రామం.. 276కు చేరిన కేరళ మృతుల సంఖ్య.. రూ.5 కోట్ల విరాళం..

కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలికి వస్తూనే ఉన్నాయి. ఇంకా 240 మంది ఆచూకీ తెలియరావట్లేదు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

కిందటి నెల 29వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలు గ్రామాలు చిక్కుకుపోయాయి. బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. వర్షాలు సైతం దీనికి తోడు కావడం వల్ల ప్రాణ నష్టం మరింత పెరిగింది.

కొండచరియలు విరిగి పడ్డ ఘటనలో మూడు జిల్లాలు ప్రభావితం అయ్యాయి. మెప్పాడి, ముండక్కై, చూరల్‌మాలా, ఆట్టమాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. కోజికోడ్ జిల్లా వనిమాళ్ గ్రామ పంచాయితీ పరిధిలోని విలంగాడ్‌ వద్దా కొండచరియలు విరిగిపడ్డాయి.

చూరల్‌మాలా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అత్యధిక మరణాలు ఇక్కడే సంభవించినట్లు చెబుతున్నారు. కొన్ని భారీ భవనాలు మినహా మిగిలిన నివాసాలన్నీ బురద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. గ్రామం మొత్తం బురద పేరుకుపోయి కనిపించింది. వాటి మధ్యలో నుంచి మృతదేహాలను వెలికి తీస్తోన్నారు రెస్క్యూ సిబ్బంది.

ముండక్కై, మెప్పాడి, ఆట్టమాల, విలాంగాడ్ వంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. మరిన్ని మృతదేహాలు వెలుగులోకి రావొచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, ఆర్మీ జవాన్లు, సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. హెలికాప్టర్లను వినియోగిస్తోన్నారు.

పణమారంపుజ, కరమంథోళ్, కబిని నదులు వరద తాకిడికి గురయ్యాయి. వాటిపై నిర్మించిన పలు వంతెనలు ధ్వంసం అయ్యాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల బురద, చెట్లు.. ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొస్తోన్నాయి. తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలను ముంచెత్తుతున్నాయి.

దేశీయ పారిశ్రామికదిగ్గజం గౌతమ్ అదాని.. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. వాయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం తనను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు