Search
Close this search box.

  రాన్సమ్‌వేర్ సైబర్ ఎటాక్.. 300 భారతీయ బ్యాంకులపై ప్రభావం..!

భారత్‌లోని పలు చిన్న బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్న సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై రాన్సమ్ వేర్ దాడి జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫలితంగా దాదాపు 300 చిన్న బ్యాంకుల్లో చెల్లింపుల వ్యవస్థలను తాత్కాలికంగా షట్ డౌన్ చేయాల్సి వచ్చిందని సమాచారం. ఈ విషయమై సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఆర్‌బీఐ కూడా ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

భారత్‌లో చెల్లింపుల వ్యవస్థలను నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బుధవారం కీలక ప్రకటన చేసింది. సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌కున్న రిటైల్ చెల్లింపుల వ్యవస్థ యాక్సెస్‌ను తొలగించినట్టు వెల్లడించింది. సీ-ఎడ్జ్ కస్టమర్లు ప్రస్తుతానికి సంస్థ చెల్లింపుల వ్యవస్థలను వినియోగించుకోలేరని ఆర్బీఐ పేర్కొంది. సమస్య మరింత ముదరకుండా 300 చిన్న బ్యాంకులకు భారత్ రిటైల్ పేమెంట్ వ్యవస్థలను తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేసినట్టు పేర్కొంది. భారత డిజిటల్ చెల్లింపుల్లో ఈ బ్యాంకుల వాటా కేవలం 0.5 శాతమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

భారత్‌లో ప్రస్తుతం 1,500 కోఆపరేటివ్, ప్రాంతీయ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో కొన్నింటిపై సైబర్ దాడి ప్రభావం పడినట్టు తెలుస్తోంది. సమస్య మరింత విస్తరించకుండా పరిస్థితిని ఎన్‌పీసీఐ సమీక్షిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్యాంకులపై సైబర్ దాడి జరిగే అవకాశం ఉన్నట్టు రిజర్వ్ బ్యాంకు, భారత సైబర్ భద్రతా విభాగాలు కొన్ని వారాల క్రితమే వివిధ బ్యాంకులను హెచ్చరించినట్టు కూడా తెలిసింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు