Search
Close this search box.

  అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు.. ప్రతిపాదనను పరిశీలిస్తున్న ఏపీ ప్రభుత్వం..

అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. నగరానికి తలమానికంగా ఇన్నర్ రింగ్‌ రోడ్డు నిర్మాణం అంశంపై దృష్టిసారించింది. విజయవాడ తూర్పు బైపాస్‌కి ఎడంగా, కనీసం 20 కిలోమీటర్ల దూరం నుంచి ఐఆర్ఆర్ వెళ్లేలా ఎలైన్‌మెంట్ సిద్ధం చేయనుంది. ఇందుకు సంబంధించి భూసేకరణ విధానంలోనూ మార్పుల దిశగా యోచిస్తోంది.

గత టీడీపీ హయాంలో సుమారు 180 కిలోమీటర్ల అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు, సుమారు 97.5 కిలోమీటర్ల పొడవైన ఇన్నర్ రింగు రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అమరావతి, విజయవాడ చుట్టూ.. తాడేపల్లి, మంగళగిరిలతో పాటు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు ఐఆర్ఆర్ లోపలికి వచ్చేలా ప్లాన్స్ సిద్ధం చేశారు. ఆ తరువాత ఈ అంశాలకు బ్రేక్ పడింది.

భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు కలిసిపోయి మహానగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలూ వేగంగా అభివృద్ధి బాటన సాగుతుండటంతో భవిష్యత్తు అవసరాలకు ఐఆర్ఆర్ అవసరమేనని ప్రభుత్వం అంచనాగా ఉంది.

ఇక అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ 8 వరుసల ప్రధాన రహదారి, నాలుగు వరుసల సర్వీసు రోడ్డుతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు మూడు ఎలైన్‌మెంట్లు గతంలో సిద్ధం చేశారు. ఫుట్‌పాత్‌తో పాటు సైకిల్ ట్రాక్‌‌ను కూడా ప్లాన్ చేశారు. వీటిల్లో రూ. 6,878 కోట్ల అంచనా వ్యయం ఉన్న రెండో ప్రతిపాదనను దాదాపుగా ఖరారు చేశారు. ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి అంచనాలూ రూపొందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఐఆర్ఆర్‌పై దృష్టి సారించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు