Search
Close this search box.

  పథకాల పేర్ల మార్పుపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే..?

భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోషల్ మీడియా వేదిక ద్వారా అభినందనలు తెలిపారు. అదేవిధంగా విద్యా శాఖ మంత్రి లోకేశ్ కు కూడా ఆయన అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారన్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళం పాడి, విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించేవారి పేర్లతో పథకాలను అమలు చేయడం మంచి పరిణామమన్నారు.

విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలు, యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బూట్లు లాంటివి ఇస్తున్నారని.. అయితే, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయడం సముచితమని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుందని ఆయన ఆకాంక్షించారు.

మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని విమర్శించారు. ఇందుకు భిన్నంగా ఈ పథకానికి ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ పేరును పెట్టడాన్ని మనమందరం స్వాగతించాలని ఆయన సూచించారు. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ.. వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయన్నారు.

అదేవిధంగా విద్యార్థులకు డా.అబ్దుల్ కలాం పేరుతో ప్రతిభా పురస్కారాలు అందజేయడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగించిన వారమవుతామన్నారు. పేద కుటుంబంలో పుట్టిన కలాం గారు ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్నారని గుర్తు చేశారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారని.. కలాం జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుందని చెప్పారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారన్నారు. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు