Search
Close this search box.

  ఆధారాలు మాయం చేయడంలో వారు సిద్ధహస్తులు.. మదనపల్లె ఘటనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక పత్రాలు దహనమైన ఘటన ప్రమాదమా? కుట్రపూరితమా? అన్నది తేల్చాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పత్రాలు దహనమైన తీరు చూస్తుంటే మానవ ప్రమేయంతో… కుట్రపూరితంగా జరిగినట్లుగా కనిపిస్తోందన్నారు. సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సీసీ కెమెరాలు పని చేయడం లేదని గుర్తు చేశారు. దస్త్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు కూడా పూర్తిగా కాలిపోయినట్లు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా కూడా కనిపించడం లేదన్నారు. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఇది జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఆధారాలు మాయం చేయడంలో సిద్దహస్తులు

మనకంటే ముందు అధికారంలో ఉన్నవారు… నేరాలకు పాల్పడి ఆధారాలు మాయం చేయడంలో సిద్ధహస్తులు అన్నారు. ఈ కోణంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సూచించారు. విచారణ జరిపి అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తన ముందు ఉంచాలని ఆదేశించారు. అసైన్డ్ భూములు, 22ఏ జాబితాలోని భూములు, వివాదాస్పద భూములు, హైవే ప్రాజెక్టుల భూసేకరణ సంబంధిత డాక్యుమెంట్లు దహనమైనట్లుగా ప్రాథమిక సమాచారం ఉందన్నారు.

అధికారులకు హెచ్చరిక

నేరం జరిగిన సమయంలో సత్వరం స్పందించాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు అధికారుల పనితీరులో మార్పు రావాలన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరు అధికారులు, ఉద్యోగులు వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శనం అన్నారు. ఇలాంటి విషయాల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

ఈ ఘటన ఆదివారం రాత్రి 11 గంటలకు జరిగితే వెంటనే ఎందుకు స్పందించలేదని కలెక్టర్ శ్రీధర్‌కు ఫోన్ చేసి అడిగారు. ఆదివారం రాత్రి పదిన్నర వరకు గౌతమ్ అనే ఉద్యోగి అక్కడే ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు. అయితే సెలవు రోజు కూడా అతను కార్యాలయానికి ఎందుకు వెళ్లాడో తెలియాలన్నారు.

ఆధారాల సేకరణలోనూ జాప్యం జరిగిందన్నారు. సోమవారం ఉదయం నుంచి ఏం విచారణ జరిపారని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆ ప్రాంతంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, కాల్ డేటా సేకరించాలని ఆదేశించారు. గతంలో అక్కడ పని చేసిన అధికారులను విచారించాలన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు