ఏదైనా వివాదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటారు. లేదా పోలీస్ స్టేషన్లు, కోర్టుకు వెళ్లి పరిష్కరించుకుంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లో అమానుషంగా ప్రవర్తించారు. ఇద్దరు మహిళలను పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు. స్థానికులు గమనించి వారిని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మన్ గావా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే, ఆ నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ కొంతమంది మహిళలు నిరసన చేపట్టారు. ఆ భూమిని తాము లీజుకు తీసుకున్నామంటూ ఆందోళన చేపట్టి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేలపై భైఠాయించిన ఇద్దరు మహిళలను పట్టించుకోని ట్రక్కు డ్రైవర్, ట్రక్కులో ఉన్న మట్టిని వారిపై పారపోశాడు. వాళ్ల నడుము వరకు మట్టి పూడుకుపోయింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు వారిని రక్షించి, స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మహిళలకు రక్షణ కల్పించడంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందంటూ మండిపడింది. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.