పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివిధ వాగులలో చిక్కుకున్న 25 మందిని హెలికాప్టర్ సాయంతో రక్షించి సురక్షిత ప్రాంతానికి అధికారులు తరలించారు.
వేలేరుపాడు మండలంలో కోడిసెల కాలువ అల్లూరి నగర్ వద్ద ఒక్కసారిగా ఉధృతమైన నీటి ప్రవాహంలో కారు కొట్టుకు పోయింది. కారులో చిక్కుకొన్న అల్లూరి నగర్ గ్రామస్తులు ఐదు గురిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు జంగారెడ్డిగూడెం ఆర్డివో కె.అద్దయ్య తెలిపారు.
కారు కొద్ది దూరం వాగు ఉదృతికి కొట్టుకు పోయి పొదల్లో ఆగడంతో వారి కోసం హెలికాప్టర్ రప్పించి రక్షించినట్టు తెలిపారు. జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం వద్ద చిక్కుకొన్న 11 మందిని జేసిబి సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సహకారంతో తెలంగాణ రాష్ట్రం అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామములో కట్టమైసమ్మగుడి వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద అవతల చిక్కుకున్న ఐదు కార్లు, నాలుగు ఆటోలు, 10 బైకులు మొత్తం 25 మందిని హెలికాప్టర్ సాయంతో రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించామని ఆర్డీవో చెప్పారు.
అంతటా అతలాకుతలం
తాళ్ళపూడి మండలం లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు రైతులు పలు ఇక్కట్లు ఎదుర్కొం టున్నారు. పలు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బంది ఎదు ర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో సైతం నీరు చేరింది. ఈ వర్షాలతో మండల కేంద్రమైన తాళ్ళపూడి సహా మండలం లోని పలుప్రాంతాల్లో డ్రైనేజీ సౌకర్యం లేని పరిస్థితి పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోనే కాక పొలాల పై సైతం మురుగు కాలువలు ఆక్రమణలకు గురై నీరు బయటకు వెళ్ళే దారి లేక వర్షపు నీటి తో పంట పొలాలు మునిగి పోయాయి. తాళ్ళపూడి మెయిన్ రోడ్లోను, వేగేశ్వరపురం కాలేజి సెంటర్, టి.మెట్ట, పెద్దేవం ప్రాంతాల్లో పొలాలు మొత్తం నీరు చేరి చెరువుల మారాయి.