దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ అంశంపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడ్ని సీబీఐ నేడు అరెస్ట్ చేసింది. అతడి పేరు పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య. పంకజ్ కుమార్ 2017 బ్యాచ్ జంషెడ్ పూర్ ఎన్ఐటీ విద్యార్థి.
ఝార్ఖండ్ లోని హజారీ బాగ్ లో ఉన్న ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) లాకర్ నుంచి నీట్ యూజీ ప్రశ్నాపత్రాన్ని అతడు చోరీ చేసినట్టు గుర్తించారు. బొకారో నివాసి అయిన పంకజ్ కుమార్ ను సీబీఐ అధికారులు పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు.
ప్రశ్నాపత్రం చోరీ చేసేందుకు అతడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా సీబీఐ అధికారులు హజారీ బాగ్ లో అరెస్ట్ చేశారు. తాజా అరెస్ట్ లతో కలిపి, నీట్ పేపర్ లీక్ లో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 14కి పెరిగింది.