Search
Close this search box.

  కేదార్‌నాథ్ ఆలయంలో 228 కేజీల బంగారం మాయం..!

ఉత్తరాఖండ్‌లోని శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం కనిపించడం లేదంటూ జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్‌నాథ్‌లో బంగారం కుంభకోణం జరిగిందని, ఆ విషయాన్ని ఎందుకు లేవనెత్తడం లేదని ఆయన ప్రశ్నించారు.

‘‘అక్కడ స్కామ్ చేసి ఢిల్లీలో కేదార్‌నాథ్‌ను నిర్మిస్తారా? అలా చేస్తే మరో కుంభకోణం జరుగుతుంది. కేదార్‌నాథ్‌ ఆలయంలో 228 కేజీల పసిడి లేదు. దర్యాప్తు కూడా మొదలుపెట్టలేదు. దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్‌ ఆలయాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. అలా జరగడానికి వీల్లేదు’’ అని అవిముక్తేశ్వరానంద అన్నారు.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో కేథార్‌నాథ్ ఆలయం నిర్మాణానికి జులై 10న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా పాల్గొన్నారు. అయితే ఢిల్లీలో ఆలయ నిర్మాణం పట్ల నిరసన తెలుపుతూ అవిముక్తేశ్వరానంద ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పూజారులు నిరసనకు దిగారు.

ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ మహారాష్ట్ర సీఎం అవుతారు

శివసేన (యుబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో అవిముక్తేశ్వరానంద సోమవారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్ధవ్ ఠాక్రే వంచనకు గురైన వ్యక్తి అని, ఆయన మళ్లీ తప్పకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. తామంతా సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్లమని, పాపం, పుణ్యాలకు నిర్వచనం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ద్రోహం అతి పెద్ద పాపమని, ఉద్ధవ్ ఠాక్రే మోసపోయారని, ఆయనకు జరిగిన ద్రోహానికి తామంతా బాధపడ్డామని తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ మహారాష్ట్ర సీఎం అయ్యే వరకు తమ బాధలు తీరబోవని అన్నారు. మోసం చేసే వ్యక్తి హిందువు కాలేడని అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యానించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు