తెలంగాణ ప్రభుత్వం గౌడన్నలకు శుభవార్త చెప్పింది. వారికి సేఫ్టీ మోకులను పంపిణీ చేయనున్నారు. గీత కార్మికులు తాటిచెట్టు ఎక్కి ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు సేఫ్టీ మోకులను రూపొందించారు. వీటికి గీత కార్మికుల కులదైవమైన కాటమయ్య పేరిట’కాటమయ్య రక్షణ కవచం’గా ఈ సేఫ్టీ మోకుకు పేరుపెట్టారు.సేఫ్టీ మోకులను ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి గౌడన్నలతో మొదటగా సహపంక్తి భోజనం చేస్తారు. ఆ తర్వాత సేఫ్టి మోకును అందజేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar Goud), ఇతర మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే పాల్గొనున్నారు. అయితే రాష్ట్రంలో గీత కార్మికులకు భద్రత లేకుండా పోయింది. చాలా మంది గీత కార్మికులు తాటి చెట్టు పై నుంచి కింద పడి చనిపోతున్నారు. సగటున సంవత్సరానికి 500 మంది గౌడన్నలు తాడి చెట్టుపై నుంచి కింద పడుతున్నారు.
ఇందులో సగటున 200 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గీత కార్మికుల పరిస్థితిపై దృష్టి సారించిన పొన్నం ప్రభాకర్ గౌడ్ సేఫ్టి మోకుల తయారు చేయాలని కోరారు. టాడీ కార్పొరేషన్ కమిషనర్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham)తో కలిసి పలు ఏజెన్సీలకు సెఫ్టీ మోకు తయారు చేసే బాధ్యత అప్పగించారు. ఓ ప్రైవేటు సంస్థ హైదరాబాద్ ఐఐటీతో కలిసి తయారు చేసిన సేఫ్టీ మోకును పనితీరును ఈ ఏడాది ఫిబ్రవరిలో యాదగిరిగుట్టలో అధికారులు ప్రాక్టికల్ గా పరిశీలించారు.
పనితీరు, సేఫ్టీ బాగుండడంతో వాటిని ఫైనల్ చేసిన సంగతి తెలిసందే. ప్రభుత్వం ఇచ్చే ఈ సేఫ్టీ మోకు కిట్లో మొత్తం ఆరు పరికరాలు ఉంటాయని చెబుతున్నారు. కిట్ లో తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్లూప్(బెల్ట్) ఉండనున్నాయి. ప్రస్తుతం వాడే మోకుకు అదనంగా ఈ బలమైన రోప్ ను బిగించనున్నారు. అలాగే గీత కార్మికుల నడుముకు ఉండే ముస్తాదుతోపాటు చుట్టూ బెల్ట్ బిగిస్తారు. తాడి చెట్టు ఎక్కేటప్పుడు మోకు కు ఉండే సేఫ్టీ రోప్ ను వారి నడుముకు ధరించిన బెల్ట్ కు బిగిస్తారు. దీంతో తాటిచెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రమాదవశాత్తు జారినా కిందపడకుండా ఆపేస్తుందని వివరిస్తున్నారు.