తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు విమర్శలు, ఆరోపణలు చేస్తుండడం పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఎన్నికల ప్రచారంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని కూటమి నేతలు చెప్పారని, కానీ జీవోలో తల్లికి మాత్రమే అని ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వివరణ ఇచ్చారు.
తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. కేంద్రం ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులనే విడుదల చేశామని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ఇవ్వలేదని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేశారు.
ఆధార్ ఉత్తర్వుల జీవోను చూపించి తల్లికి వందనం జీవో అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోన శశిధర్ అన్నారు. తల్లికి వందనం పథకంపై మార్గదర్శకాలను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అందరికీ తెలియజేస్తామని పేర్కొన్నారు.