ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లోని ఈవీఎంను పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తొలి రోజు విచారణలో సహకరించలేదని తెలిసింది. నెల్లూరు జైలులో ఉన్న ఆయనను కోర్టు అనుమతితో నిన్న పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.
మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి ఏడు గంటల వరకు కొనసాగింది. అధికారులు మొత్తం 50 ప్రశ్నలు అడిగితే వాటిలో 30 ప్రశ్నలకు నేను వెళ్లలేదని, వారెవరూ తనకు తెలియదనే సమాధానం చెప్పినట్టు సమాచారం.
పోలింగ్ రోజున పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని, ఈవీఎంను పగలగొట్టలేదని, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని, ఆ రోజు తన వెంట గన్‌మెన్లు లేరని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. కాగా, కారంపూడి అల్లర్లు, సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించిన కేసులో నేడు పిన్నెల్లిని విచారించనున్నారు.