పవన్ కళ్యాణ్ పనితనం ఏ స్థాయిలో ఉంటుందనేది తాజాగా పిఠాపురంలో జరుగుతున్న తీరే ఓ ఉదాహరణ. ఏ నియోజకవర్గానికి లేని అవకాశం ఇక్కడ కల్పించారు. ఏకంగా జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి వినతులు స్వీకరించే కార్యక్రమం ప్రారంభించారు. ఒక్క రోజులో జనం నుండి వచ్చిన అర్జీలు చూసి కలెక్టర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఒక్క రోజు గ్రీవెన్ సెల్‌కు ఏకంగా 556 అర్జిలు వచ్చాయి. పిఠాపురం పట్టణంలోని రథాలపేట వద్ద ఉన్న అంబేడ్కర్ కమ్యూనిటీహాలు నందు అర్జీల స్వీకరణ ప్రక్రియ సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఇటీవల గొల్లప్రోలు పింఛన్ పంపిణీ కార్యక్రమానికి పవన్ వచ్చిన సందర్బంలో ఇకపై పిఠాపురంలో రెండు వారాలకు ఒక్కసారి పిఠాపురంలో గ్రీవెన్స్ ఉంటుందని చెప్పారు. దీంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో , చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్(పిజిఆర్ ఎస్)కు జనం నుండి అపూర్వ స్పందన వచ్చింది. గ్రీవెన్స్ వేదిక వద్ద భారీగా జనం రావడంతో అధికారులు వారి సమస్యలను స్వీకరించారు.
పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఉన్న సమస్యలపై గ్రామాల నుండి పెద్ద ఎత్తున జనం కలెక్టర్‌ను కలిసి స్వయంగా అర్జీ దరఖాస్తులు అందజేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నాం 2 గంటల వరకూ అర్జీలు స్వీకరించారు. వచ్చిన ప్రతీ ఒక్కరి నుండి అర్జీ స్వీకరించి ఆన్‌లైన్ చేశారు. ఎక్కువగా పింఛన్ల కోసం, రోడ్లు, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై అధికారులకు అర్జీలు వచ్చాయి. నియోజకవర్గంలోని గొల్లప్రోలు, కొత్తపల్లి, పిఠాపురం మండలంతోపాటు, గొల్లప్రోలు, పిఠాపురం పట్టణ వాసుల నుండి పెద్ద ఎత్తున దరఖాస్తు దారులు అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అధికారులు బృందాలుగా అర్జీలు తీసుకున్నారు. పిఠాపురం మున్సిపాల్టీలో తాగునీరు, పారిశుద్ధ్యం, పెన్షన్ల పునరుద్ధరణపై టిడిపి కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే వర్మ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు అర్జీల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.