వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది
దేశంలోనే పిఠాపురం అగ్రస్థానంలో ఉంటుంది
పింఛన్ల పంపిణీలో పాల్గొన్న పవన్
రాష్ట్రంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం జవాబుదారితనంతో పనిచేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం కొణదల పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. గొల్లప్రోలు లో సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వంలో ఏ నిధులు ఎక్కడ నుండి దోచుకున్నారో అర్థం కాని పరిస్థితిలో రాష్ట్ర లెక్కలు ఉన్నాయన్నారు. అన్ని వ్యవస్థల్ని వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.తాను నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మరింత ఘోరంగా ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వేలకోట్ల రూపాయలు ఏయే అకౌంట్ ల నుండి తీసుకున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి గ్రామంలో త్రాగునీరు పారిశుద్ధ్యం లక్ష్యంగా పని చేస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పించడం, పేదల సమస్యలను తీర్చడమే లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని భరోసా ఇవ్వగలమన్నారు.
గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా చేసిన వాటిపై సర్వే చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు పంపిణీ చేయలేమని చెప్పిన వారంతా ఏమయ్యారని, ఈనాడు ప్రభుత్వ ఉద్యోగుల చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ విజయవంతంగా జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపడితే పింఛన్లు రావనే భయాన్ని కల్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు. కానీ చంద్రబాబు కూటమి ముఖ్య నాయకుడిగా ఈరోజున ఎంతోమందికి రెట్టింపు నగదుతో పింఛన్లను అందించడం జరిగిందన్నారు. ప్రజలు తమపై పూర్తి నమ్మకం ఉంచాలని, ఖచ్చితంగా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తాము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
వాలంటీర్లు కమిషన్ తీసుకున్నారు
గత ప్రభుత్వంలో పెన్షన్ డబ్బులు ఇచ్చేటప్పుడు వాలంటీర్లు లబ్ధిదారుల నుండి కొంత కమిషన్ తీసుకున్నారన్న వార్తలు వచ్చాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు చే పెన్షన్ పంపిణీ చేయడం వల్ల అటువంటి ఇబ్బంది సాధారణంగా రాదన్నారు. ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు దానికి సమాధానం చెప్పాల్సిన భయం ఉండడం వల్ల అటువంటి పొరపాట్లు జరగవన్నారు.ఈ సందర్భంగా పవన్ దివ్యాంగులతో మాట్లాడారు . వారికి పెన్షన్లు అందజేశారు. అన్ని పనులు చిటికెలో జరిగిపోవని కొంత సహనం ఉండాలని ప్రజల్ని ఉద్దేశించి పవన్ కోరారు. భవిష్యత్తులో జరిగే పనులు చిటికెలో అయ్యేలా తాము నిబద్దతతో పనిచేస్తామన్నారు. అద్భుతాలు సృష్టించం కానీ, కానీ ప్రతిదానికి లెక్కగా పనిచేస్తామని ప్రజలు తమను ఆదరించాలని పవన్ కోరారు.
పిఠాపురంలోనే శాశ్వతంగా ఉంటా
తాను పిఠాపురం లోనే శాశ్వతంగా ఉంటానని ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు. పిఠాపురం అనువైన ఇంటి స్థలం కోసం పరిశీలిస్తున్నామన్నారు. ఉప్పాడ మత్స్యకారులు సమస్యలు, రైతులు ప్రజల ఇబ్బందులను తొలగిస్తామన్నారు. దేశంలోనే అత్యంత ఆదర్శవంతమైన నియోజ కవర్గంగా పిఠాపురాన్ని తయారు చేస్తామన్నారు. ఏ ప్రాజెక్టు నిర్వహించిన పిఠాపురాన్నే ఆదర్శవంతంగా తీసుకునేలా అభివృద్ధి చేస్తామననారు.
ఏపీ నుండి వెళ్లిన ఎర్రచందనం నేపాల్ దొరికింది
రాష్ట్రం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉందని సహజ సంపద దోచుకున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎర్రచందనం నేపాల్ తరలి వెళ్లిపో యిందన్నారు. మెట్రిక్ టన్నులకొద్దీ వెళ్లిపోయిన ఎక్కడ ఒక చెక్ పోస్ట్ వద్ద కూడా తనిఖీ లేదన్నారు. నేపాల్ పోలీసులు పట్టుకోవడం వల్ల ఎర్రచందనం పెద్దిరెడ్డి , మిథున్ రెడ్డి ల పేర్లతో అడ్డుఅదుపులేకుండా తరలివెళ్లిందన్నారు. అటువంటి సహజ సంపదను వెనక్కి తిరిగి తీసుకువచ్చేందుకు ఆలోచిస్తున్నామన్నారు .అటవీ శాఖలో 420 పోస్టులు ఉన్నాయని యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న అందుకు తగ్గ నిధులు లేవన్నారు. ఇప్పుడిప్పుడే ప్రక్షాళన జరుగుతుందని పేదలకు సహాయం చేసేందుకు తాను ముందుంటానన్నారు.