Search
Close this search box.

  మణిపూర్ అల్లర్ల వెనక భారత సంతతి యూకే ప్రొఫెసర్ హస్తం..?

మణిపూర్ హింసాత్మక ఘటనల వెనక ఓ భారత సంతతి ప్రొఫెసర్ హస్తం ఉందంటూ ఇంఫాల్ కు చెందిన ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలోని బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ ఉదయ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన వ్యాఖ్యలతో వర్గాల మధ్య ఘర్షణను రెచ్చగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రొఫెసర్‌కు ఖలిస్తానీ వాదులతో కూడా సంబంధాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

తన ఆన్‌లైన్ పోస్టులతో రెండు వర్గాల మధ్య ప్రొఫెసర్ విభేదాలు హెచ్చరిల్లే వ్యాఖ్యలు చేశారని స్థానికుడు పేర్కొన్నారు. దురుద్దేశంతో మెయితీ వర్గాల మతవిశ్వాసాలను అవమానించి ఇతర వర్గాలతో విభేదాలు తలెత్తేలా చేశారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆడియో చర్చలు మొదలెట్టి ఎలా వివాదాలు సృష్టించాలో స్థానికులకు నేర్పించారని ఫిర్యాదులో తెలిపారు.

ఖలిస్థానీ వాదులతో సదరు ప్రొఫెసర్‌కు సంబంధాలు ఉండే అవకాశం ఉండటంతో అతడి కాల్ రికార్డ్స్ పరిశీలించాలని, లుకౌట్ నోటీసు జారీ చేయాలని కూడా వెల్లడించారు. భారత సమగ్రత సార్వభౌమాధికారాన్ని సవాలు చేసేలా దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాబట్టి ఉపా చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని కోరారు. కాగా, ఈ ఘటనపై ప్రొఫెసర్ ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే, ఆయన ఎక్స్ అకౌంట్‌‌పై ఆంక్షలు విధించినట్టు పేర్కొంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు