Search
Close this search box.

  కాకినాడ నుండి ఆఫ్రిక‌న్ దేశాల‌కు పేద‌ల బియ్యం

కోట్లు గ‌డించిన క‌బ్జారాయుళ్ల‌ను వ‌దిలేది లేదు

ఇప్ప‌టికే 6 గోదాముల్లో లోపాల‌ను గుర్తించాం

బియ్యం ఎగుమ‌తుల‌పై సిఐడి విచార‌ణ కోరుతున్నాం : పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌

పోర్ట్ కేంద్రంగా సాగిన రీసైక్లింగ్ బియ్యం ఎగుమతుల కార్యకలాపాలపై సీఐడీ విచారణకు అప్పగిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పౌరసరఫరాలు, రెవిన్యూ, లీగల్ మెట్రాలజీ తదితర శాఖల అధికారులతో కలిసి బియ్యం గోదాములను తనిఖీలు నిర్వహించారు. కాకినాడ పట్టణం పోర్టు ఏరియాలో ఉన్న అశోక ఇంటర్నేషనల్, హెచ్ ఒన్ బియ్యం గోదాములను, లాంగర్ రేవు యాంకరేజ్ పోర్టులో ఎగుమతి అవుతున్న బియ్యాన్ని తనిఖీ చేశారు.

రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా తొలి రోజు నిర్వహించిన తనిఖీల్లో 7,615 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. లావన్ ఇంటర్నేషనల్, అయ్యప్ప ఎక్స్ పోర్ట్, విశ్వ ప్రియా, సార్టేక్స్ ఇండియా, సరళా ఫుడ్స్, వీఎస్.రాజు సన్స్ గోదాముల్లో పీడీఎస్ బియ్యానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు దొరకాయన్నారు. రెండో రోజు తనిఖీలలో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి పేదవాడికి అందాల్సిన బియ్యాన్ని వారి పొట్ట కొట్టి అక్రమంగా ఆఫ్రికన్ దేశాలకు తరలిస్తూ భారీ అవినితికి పాల్పడ్డుతున్నారన్నారు. ఇంతవరకు కాకినాడ యాంకరేజ్ పోర్టు గురించి దినపత్రికల్లో అనేక కథనాలు చదవడంతో తెలుసుకున్నానని, నేడు తొలిసారిగా, స్వయంగా యాంకరేజ్ పోర్టులో జరుగుతున్న కార్యకలాపాలను చూసి చాలా ఆశ్చర్యానికి లోనయ్యానని మంత్రి తెలిపారు.

ఈ తనిఖీల్లో అశోక గోదాములో 2,800 మెట్రిక్ టన్నులు, హేచ్ఒన్ గోదాములో 2,500 మెట్రిక్ టన్నులు మొత్తం 5,800 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, స్టాక్ రిజిష్టర్లను సీజ్ చేశామన్నారు. ఇంకా లోతుగా తనిఖీలు చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల ఎండీ, జాయింట్ కలెక్టర్ తో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన గోదాములను తనిఖీ చేసి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిణీ చేసే పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా రీసైక్లింగ్ చేస్తున్న వారిపై చర్య తీసుకుంటామన్నారు. పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేయడంతో పాటు వినియోగదారునికి, రైతుకు అన్యాయం చేస్తున్నారన్నారు. రేషన్ కార్డుదారులకు అందించే సరుకులను నూటికి నూరు శాతం పారదర్శకంగా, నిజాయితీగా అందేలా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

మరో దఫా యాంకరేజ్ పోర్టును సందర్శించి, పూర్తి ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశాలపై సమగ్రమైన రీ పోర్ట్ సిద్ధం చేసి, సీఐడీకి అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన అందించేందుకు ముందుకు అడుగులు వేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

పర్యటనలో మంత్రి వెంట లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోలర్ డి.రామ్ కుమార్, పి.సుధాకర్, జిల్లా లీగల్ మెట్రాలజీ డీప్యూటి కంట్రోలర్ ఎన్.జనర్థన రావు, పౌరసరఫరాల సంస్థ డీఎం బి బాలసరస్వతి, డీఎస్వో ఎంవీ.ప్రసాద్, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్ తహసీల్దార్లు కె.చెల్లన్నదొర, బి.విజయ ప్రసాద్, సీఎస్డీటీలు, టెక్నాల్ అసిస్టెంట్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు