Search
Close this search box.

  పిఠాపురంలో కౌన్సిల్ వాకౌట్‌

పిఠాపురంలో కౌన్సిల్ వాకౌట్‌

ఎన్నిక‌ల ముందు భ‌ర్తీ చేసిన అక్ర‌మ‌ ఉద్యోగాలు తొల‌గించాలంటూ కౌన్సిల‌ర్లు ప‌ట్టు

వైసీపీ ప్ర‌భుత్వంలో జ‌రిగిన ప‌నుల‌పై విచార‌ణ‌కు టిడిపి డిమాండ్

ఛైర్‌ప‌ర్స‌న్‌, క‌మిష‌న‌ర్ తీరుపై తీవ్ర‌ నిర‌స‌న‌

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో అక్ర‌మంగా నియ‌మించిన ఉద్యోగాల‌పై కౌన్సిల‌ర్లు మండిప‌డుతున్నారు. సాధార‌ణ కౌన్సిల్ స‌మావేశాన్ని వాకౌట్ చేసి నిర‌స‌న తెలిపారు. కౌన్సిల్‌కు ఎటువంటి స‌మాచారం లేకుండా , బాధితుల‌కు అన్యాయం చేసి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకున్నార‌ని ఆరోపించారు. పిఠాపురం మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్సన్‌, క‌మిష‌న‌ర్ తీరుపై వైసీపీ, టిడిపి కౌన్సిల‌ర్లు క‌లిసి వాకౌట్ చేసి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. దీంతో కోరం స‌భ్యులు లేక‌పోవ‌డంతో స‌మావేశాన్ని ఛైర్ ప‌ర్స‌న్‌ వాయిదా వేశారు.

పిఠాపురం మున్సిప‌ల్ కౌన్సిల్ సాధార‌ణ స‌మావేశం శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ గండేప‌ల్లి సూర్యావ‌తి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. స‌మావేశంలో 42 అంశాల‌తో కూడిన అజెండాను కౌన్సిల్ ముందుంచారు. అయితే కౌన్సిల‌ర్లు స‌మావేశానికి ముందు గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో 6 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అంశాన్ని తాము కోరిన‌ప్ప‌టికీ అజెండాకు ఎందుకు తీసుకురాలేద‌ని ప్ర‌శ్నించారు. క‌మిష‌నర్ ఆ అంశం గ‌తంలోనిద‌ని, తాను అప్పుడు లేన‌ని చెప్ప‌డంతో కౌన్సిల‌ర్లు స‌మాధానం చెప్పాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

పిఠాపురంలో కౌన్సిల్ వాకౌట్‌

అప్ప‌టి వ‌ర‌కూ కౌన్సిల్ స‌మావేశం జ‌ర‌గ‌నివ్వబోమ‌ని చెప్పారు. కౌన్సిల్‌కు విలువలేన‌ప్పుడు అజెండా కాపీలు ఎందుక‌ని టిడిపి కౌన్సిల‌ర్ న‌గేష్ అజెండా కాపీల‌ను చించివేశారు. వైసీపీ, టిడిపి కౌన్సిల‌ర్లు క‌లిసి బాధితుల‌కు న్యాయం చేయాల‌ని నిర‌స‌న వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. దీంతో కోరం సంఖ్య‌లేదు. కౌన్సిల్ లో ఉన్న 29 మంది స‌భ్యుల‌కు గాను 26 మంది వ‌ర‌కూ బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో కోరం లేక స‌మావేశాన్ని వాయిదా వేసి ఛైర్‌ప‌ర్స‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. అనంత‌రం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ క‌న‌కారావు చాంబ‌ర్‌కు వెళ్లిన కౌన్సిల‌ర్లు పిఠాపురం మున్సిపాల్టీలో జ‌రిగిన‌, జ‌రుగుతున్న అవినీతి ప‌నులపై విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. దీనికి ఆయ‌న తాను పూర్తి స్థాయిలో కౌన్సిల్‌కు స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పుకొచ్చారు.

ర్యాటిఫికేష‌న్ పేరుతో దారుణ‌మైన అవినీతి : టిడిపి కౌన్సిల‌ర్లు

పిఠాపురం మున్సిపాల్టీలో ర్యాటిఫికేష‌న్ పేరుతో దారుణ‌మైన అవినీతి జ‌రిగింద‌ని పిఠాపురం టిడిపి కౌన్సిల‌ర్లు న‌గేష్‌, అన్న‌పూర్ణ‌, రాయుడు శ్రీనులు అన్నారు. ల‌క్ష‌ల రూపాయాలు ప‌నుల‌కు ముంద‌స్తు అనుమ‌తి ఇచ్చి వాటిని ర్యాటిఫికేష‌న్ పేరుతో కౌన్సిల్‌కు తీసుకొచ్చి, కౌన్సిల‌ర్ల‌ను దద్ధ‌మ్మ‌లు చేశార‌న్నారు. ఇందులో అధికారుల పాత్ర ఉంద‌ని దానిపైనా విచార‌ణ చేయాల‌న్నారు. పిఠాపురంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు నిధుల పేరుతో ల‌క్ష‌ల రూపాయాలు దోచుకున్నార‌ని, అన్ని ప‌నులలో దోచుకుతిన్నార‌ని, 18వ కౌన్సిల‌ర్ అన్న‌పూర్ణ ఆరోపించారు. వైసీపీ ప్ర‌భుత్వంలో కాంట్రాక్ల‌ర్లు చేసిన ప‌నుల‌పై స‌మ‌గ్ర విచార‌ణ చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. అక్ర‌మ ఉద్యోగాల విష‌యంలో బాధితుల‌కు న్యాయం చేయాల‌ని కౌన్సిల‌ర్ న‌గేష్ కోరారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు