ఒకప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు.. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నాయి. పాత సినిమాలను కొత్త టెక్నాలజీతో 4K వెర్షన్లో విడుదల చేస్తూ అభిమానులకు మంచి అనుభూతిని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 22 ఏళ్ల క్రితం విడుదలైన ఓ బోల్డ్ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. అదే ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘ఆరుగురు పతివ్రతలు’.
విభిన్నమైన కథాంశాలతో పాటు తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. ఆయన దర్శకత్వంలో 2004లో విడుదలైన ‘ఆరుగురు పతివ్రతలు’ అప్పట్లో ప్రత్యేకమైన చర్చకు దారితీసింది. చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాను గతంలో అక్టోబర్ 29న 4K వెర్షన్లో రీ రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే కొన్ని అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 11న మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దాదాపు 40 మంది కొత్త నటీనటులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. బోల్డ్ కామెడీతో పాటు వైవాహిక సంబంధాలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలను కథలో భాగంగా చూపించారు. దీంతో విడుదల సమయంలో ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది.
కాలక్రమేణా ఈ సినిమాకు ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు 4K వెర్షన్లో మళ్లీ విడుదలవుతుండటంతో అప్పట్లో సినిమా చూసిన ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలు గుర్తుకురానున్నాయి. మరోవైపు అప్పట్లో చూడలేకపోయిన కొత్త తరం ప్రేక్షకులకు కూడా బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం దక్కనుంది.
మరి 22 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తున్న ‘ఆరుగురు పతివ్రతలు’ ఈసారి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది? రీ రిలీజ్‌తో ఎలాంటి స్పందన అందుకుంటుంది? అనేది చూడాలి!









