నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా గురించి కాదు.. చిత్రబృందంపై సీనియర్ నటుడు బాబు మోహన్ చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తనను సినిమా యూనిట్ అవమానించిందని, అందుకే వారికి కర్మ ఫలితం దక్కిందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ ఈ సినిమా విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. సికింద్రాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం చిత్రబృందం తనను సంప్రదించిందని తెలిపారు. అంతేకాకుండా తనకు లుక్ టెస్ట్ నిర్వహించి, మేకప్ వేయడంతో పాటు వివిధ రకాల కాస్ట్యూమ్స్ కూడా ప్రయత్నించారని చెప్పారు. ఆ పాత్రకు తానే సరైన వ్యక్తినని ప్రశంసిస్తూ, షూటింగ్ ప్రారంభమైనప్పుడు తప్పకుండా పిలుస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
అయితే ఆ తర్వాత సినిమా యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలయ్యే వరకు తనను పిలుస్తారేమోనని ఎదురుచూశానని, కానీ చివరకు ఎవరూ స్పందించలేదని తెలిపారు. ఒకవేళ తనను ఆ పాత్రలో తీసుకోవడం ఇష్టం లేకపోతే ఆ విషయం ముందే చెప్పాల్సిందని, కనీసం ఆ మర్యాద కూడా పాటించకుండా తనను అవమానించారని అసహనం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ‘ది ప్యారడైజ్’ సినిమా ఫలితంపై కూడా బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం ఏరియాలో మినహా మిగతా ప్రాంతాల్లో సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదని, కథనం నెమ్మదిగా ఉందనే విమర్శలు కూడా వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో చాలామంది తనను లక్కీ లెగ్‌గా భావిస్తారని, గతంలో తాను నటించని కొన్ని సినిమాలు పరాజయం పాలైన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే జరిగిందని, తనను అవమానించిన వారికి కర్మ ఫలితం దక్కిందంటూ ఘాటుగా స్పందించారు.
మొత్తానికి నాని ‘ది ప్యారడైజ్’ సినిమా విషయంలో బాబు మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. మరి బాబు మోహన్ వ్యాఖ్యలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.









