ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తర్వాత చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాకా’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు మేకర్స్ నుంచి పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో అసలు ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఆసక్తి నెలకొంది.
రాకా రెండు భాగాలుగా వస్తుందా?
ఇప్పటివరకు ‘రాకా’ 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా రిలీజ్ 2028 వరకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
అదే సమయంలో ఈ సినిమాను ఒకే భాగంగా కాకుండా.. రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఒకవేళ రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే.. మొదటి భాగాన్ని 2027లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
మూడు విభిన్నమైన పాత్రల్లో బన్నీ?
‘రాకా’ కథ రెండు భిన్నమైన ప్రపంచాలు, టైమ్‌లైన్స్ చుట్టూ సాగుతుందని టాక్. ఇందులో పౌరాణిక, వేద కాలానికి సంబంధించిన అంశాలతో పాటు ఆధునిక ప్రపంచానికి సంబంధించిన కథ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
కథ పరిధి, భారీ బడ్జెట్, విభిన్నమైన పాత్రలు, యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా సినిమా నిడివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సినిమాను ఒకే భాగంగా విడుదల చేయాలా? లేక రెండు భాగాలుగా తీసుకురావాలా? అనే విషయంలో మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
70 శాతం షూటింగ్ పూర్తి!
ప్రస్తుతం ‘రాకా’ షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన షూటింగ్‌తో పాటు ఇప్పటికే తీసిన రషెస్‌ను పరిశీలించిన తర్వాతే సినిమాను ఒక భాగంగా రిలీజ్ చేయాలా? రెండు భాగాలుగా విడుదల చేయాలా? అనే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందట.
ఇక త్వరలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో రష్మిక మందన్న కూడా పాల్గొనబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో దీపికా పదుకొనే కీలక పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన్న నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే రమ్యకృష్ణ, జాన్వీ కపూర్, యోగిబాబు, జిమ్ సర్భ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.
మొత్తానికి ‘రాకా’ను ఒకే భాగంగా తీసుకురాబోతున్నారా? లేక రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారా? అనే ఆసక్తి మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది. మరి మేకర్స్ దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి!









