దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, విలక్షణ నటుడు సూర్య.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ క్రేజీ కాంబోపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
సూర్యతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే.. అది కచ్చితంగా చాలా స్పెషల్‌గా ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ కాంబినేషన్ గురించి మరింత మాట్లాడేందుకు మాత్రం ఇది సరైన సమయం కాదని ఆయన చెప్పుకొచ్చారు.
ఇటీవల మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, సూర్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యతో తన కాంబినేషన్‌పై విలేకరులు ప్రశ్నించగా రాజమౌళి ఆసక్తికరంగా స్పందించారు.
తనను ఈ ప్రశ్న అడుగుతారని ముందే ఊహించానని.. దానికి సమాధానం కూడా సిద్ధం చేసుకున్నానని రాజమౌళి తెలిపారు. కానీ తాము అక్కడికి వచ్చిన ఉద్దేశం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాను ప్రమోట్ చేయడమేనని, ఇప్పుడు తాను సూర్య సినిమాకు సంబంధించిన విషయం మాట్లాడితే అదే పెద్ద హెడ్‌లైన్‌గా మారి అసలు సినిమా ప్రమోషన్ పక్కకు వెళ్లిపోతుందని అన్నారు.
అయితే అభిమానులకు మాత్రం రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు.
“మేమిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేసినా.. అది కచ్చితంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది” అంటూ సూర్యతో తన కాంబినేషన్‌పై పాజిటివ్‌గా స్పందించారు.
అంతేకాదు సూర్యపై రాజమౌళి ప్రశంసలు కూడా కురిపించారు. ఇటీవల ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి సినిమాలతో వరుసగా విజయాలు అందుకోవడం డబుల్ ధమాకా అంటూ అభినందించారు. అలాగే జితూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘సీన్’ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా చాలా బాగున్నాయని ప్రశంసించారు.
ఇక గతంలోనే రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని తాను కోల్పోయానని, ఆయనతో కలిసి పనిచేయాలనే కోరిక ఉందని సూర్య పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలతో.. భవిష్యత్తులో ఈ ఇద్దరు కలిసి సినిమా చేసే అవకాశం ఉందా? అనే చర్చ మళ్లీ మొదలైంది.
మరి రాజమౌళి–సూర్య కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో.. ఆ ‘స్పెషల్’ సినిమా ఎలాంటి కథతో వస్తుందో చూడాలి.









