పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి తల్లి పాత్రలో సీనియర్ నటి జరీనా వహాబ్ నటిస్తున్నట్లు ప్రకటించిన చిత్రబృందం.. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఓ ఎమోషనల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ఈ గ్లింప్స్‌లో జరీనా వహాబ్ ‘జుబేదా’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న ఆమె.. పరిస్థితులు చేతులు దాటిపోవడంతో ఆకలికి తట్టుకోలేక భిక్షాటన చేయాల్సి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకునే సన్నివేశం చాలా ఎమోషనల్‌గా ఉంది.
ఓ బిచ్చగత్తె జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అవమానాలు, ఆత్మగౌరవం కోసం ఆమె చేసే పోరాటంతో పాటు.. తన కొడుకుపై ఉన్న మాతృత్వాన్ని ఈ గ్లింప్స్‌లో చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ పాత్ర సినిమాకు ఎంత కీలకమో ఈ చిన్న గ్లింప్స్ ద్వారా మేకర్స్ చెప్పే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి మరో కీలక పాత్ర టబుకు సంబంధించిన గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో టబు గౌరీ హెగ్డే అనే పవర్‌ఫుల్ ఇన్‌కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ పాత్రలో కనిపించనున్నారు.
“మన స్టైల్‌లో ముందు షూట్ చేస్తాం.. తర్వాత మాట్లాడతాం” అంటూ టబు చెప్పే డైలాగ్ ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చూపిస్తోంది.
ఒకవైపు పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా టబు.. మరోవైపు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తల్లిగా జరీనా వహాబ్.. వీరి పాత్రలు విజయ్ సేతుపతి పాత్రతో ఎలా కనెక్ట్ అవుతాయన్న ఆసక్తిని మేకర్స్ పెంచుతున్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో తన మ్యూజిక్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాను జేబీ మోషన్ పిక్చర్స్ సమర్పిస్తోంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మొత్తానికి ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. విజయ్ సేతుపతి కెరీర్‌లో ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’ మరో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచేలా కనిపిస్తోంది.









