సాధారణంగా ఏదైనా సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ రివ్యూల కంటే నెగిటివ్ రివ్యూలే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. సినిమా బాగున్నా కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తూ సినిమాను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు గతంలో చాలాసార్లు వినిపించాయి.
ఈ అంశంపై ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమా వెనుక నిర్మాతలు, దర్శకులు పడే కష్టాన్ని గుర్తించాలని.. కావాలనే సినిమాలను టార్గెట్ చేయడం సరికాదని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
ఇక తాజాగా ‘రోమాంచకం’ సినిమా విషయంలో కూడా ఇలాంటి నెగిటివ్ రివ్యూలు వచ్చాయంటూ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ఒక కథను పేపర్‌పై నుంచి తెరపైకి తీసుకురావడం అంత సులభమైన విషయం కాదని ఆయన అన్నారు. ఒక రైటర్ కథ రాసినప్పటి నుంచి.. దాన్ని దర్శకుడు తెరకెక్కించడం, షూటింగ్ సమయంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను అధిగమించడం వరకు సినిమా వెనుక చాలా మంది కష్టం ఉంటుందని తెలిపారు.
అయితే ‘రోమాంచకం’ రివ్యూల విషయంలో కొంతమంది కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వ్యవహరించారని ఆయన ఘాటుగా స్పందించారు.
“స్పిరిట్‌ను కూడా పడగొట్టండి చూద్దాం!”
ఇదే సమయంలో తన నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాను ప్రస్తావిస్తూ ప్రణయ్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
“మీకు అంత సామర్థ్యం ఉంటే.. నా నిర్మాణంలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాను కూడా మీ రివ్యూలతో దెబ్బతీయండి. సినిమా స్థాయిని తగ్గించగలరా? మీ రివ్యూలతో సినిమాను చంపేయగలరా? మీకు దమ్ముంటే స్పిరిట్‌ను పడగొట్టండి చూద్దాం” అంటూ ఆయన సవాల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘స్పిరిట్’ పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా స్పిరిట్
ఇక ‘స్పిరిట్’ విషయానికి వస్తే.. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా నుంచి సినిమా వస్తుందంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక ‘స్పిరిట్’ను హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది.
ఈ సినిమాను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొనే హీరోయిన్గా ఎంపికైనప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి వచ్చారు.
ప్రస్తుతం ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి ప్రణయ్ రెడ్డి వంగా చేసిన ఈ సవాల్‌కు తగ్గట్టుగా ‘స్పిరిట్’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.









