ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ సినిమా పేరే వినిపిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో కలెక్షన్లలో జోరు చూపిస్తోంది.
ఇదే సమయంలో ‘టాక్సిక్’ సినిమాకు డివైడ్ టాక్ రావడం కూడా ‘ఇరుముడి’కి కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే రవితేజ సినిమా ఈ ఏడాది టాప్ మూవీస్ జాబితాలోకి దూసుకెళ్లింది.
తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.26 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘ఇరుముడి’.. 2026లో ఇప్పటివరకు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల జాబితాలో టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఇందులో ఇండియాలోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ లిస్టులో ‘పెద్ది’ సినిమా రూ.116 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ‘ది రాజా సాబ్’ రూ.96 కోట్లతో రెండో స్థానంలో ఉంది. చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రూ.72 కోట్లతో మూడో స్థానంలో, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.52.8 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఇక రూ.26 కోట్ల ఓపెనింగ్‌తో ‘ఇరుముడి’ టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చింది.
వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న రవితేజకు ‘ఇరుముడి’ మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమా కంటెంట్‌కు తోడు రవితేజ మాస్ ఇమేజ్ కూడా కలెక్షన్లకు ప్లస్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మంచి టాక్ తెచ్చుకున్న ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి సినిమాలతో పోలిస్తే ‘ఇరుముడి’ తొలి రోజు వసూళ్లు మెరుగ్గా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఇక డే వైజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజు రూ.26 కోట్లు, రెండో రోజు రూ.24 కోట్లు, మూడో రోజు రూ.27 కోట్లు, నాలుగో రోజు రూ.19 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఐదో రోజు కూడా పెద్దగా డ్రాప్ లేకుండా సుమారు రూ.14 కోట్ల గ్రాస్ సాధించినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
దీంతో ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ‘ఇరుముడి’ షోలు తగ్గించి ‘టాక్సిక్’కు థియేటర్లు కేటాయించడంపై ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే సినిమా మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.22 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తుండటంతో నిర్మాతలు, మూవీ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
మరి ఇదే జోరును కొనసాగిస్తూ ‘ఇరుముడి’ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుంది? రూ.150 కోట్ల మార్క్‌ను అందుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








