ఎన్నో ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్‌కు ఎట్టకేలకు ‘లెనిన్’ రూపంలో మంచి విజయం దక్కింది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు మురళీకృష్ణ మంచి ఎమోషన్స్‌తో తెరకెక్కించి సేఫ్‌గా ల్యాండ్ చేశాడనే టాక్ వచ్చింది. దీంతో అఖిల్ ఇకపై మరీ మాస్ జానర్ కాకుండా కాస్త డిఫరెంట్ కథలను ఎంచుకుంటాడని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు చూస్తుంటే అఖిల్ మరోసారి తన పాత మాస్ ట్రాక్‌లోకి వెళ్లబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ చర్చకు ప్రధాన కారణం అఖిల్ లేటెస్ట్ లుక్. గుబురు గడ్డం, మీసం, కొత్త హెయిర్‌స్టైల్‌తో పాటు చెవికి పోగు పెట్టుకుని రగ్గడ్ లుక్‌లో అఖిల్ కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు క్లాస్, స్టైలిష్ లుక్స్‌లో ఎక్కువగా కనిపించిన అఖిల్.. ఈ కొత్త అవతారంలో మాత్రం పూర్తిగా మాస్ షేడ్స్ చూపిస్తున్నాడు.
దీంతో అఖిల్ ఇకపై క్లాస్ లవ్ స్టోరీలకు దూరంగా ఉండి, మాస్ యాక్షన్ సినిమాల వైపు అడుగులు వేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి.
ఇదే సమయంలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో అఖిల్ జతకట్టబోతున్నాడనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారనే ఇండస్ట్రీ టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే ఈ కాంబినేషన్ అధికారికంగా కన్ఫర్మ్ అయితే మాత్రం అఖిల్ కెరీర్‌లో ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది. బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్స్‌కు అఖిల్ యాక్షన్ ఇమేజ్ తోడైతే స్క్రీన్‌పై కాంబినేషన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
బోయపాటి సినిమా అంటే భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ హీరో ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్ తప్పనిసరిగా ఉంటాయి. అలాంటి దర్శకుడి చేతిలో అఖిల్ పడితే స్క్రీన్‌పై మాస్ ట్రీట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. అఖిల్ ‘లెనిన్’తో ఫామ్‌లోకి వచ్చిన సమయంలో మళ్లీ పూర్తిస్థాయిలో మాస్, యాక్షన్ జానర్‌లోకి వెళ్తే ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అభిమానులను ఆలోచింపజేస్తోంది. బోయపాటి గత చిత్రాల్లో ‘స్కంద’, ‘వినయ విధేయ రామ’ వంటి సినిమాలు ఎదుర్కొన్న విమర్శలు కూడా ఈ కాంబినేషన్‌పై ఆసక్తితో పాటు కొంత టెన్షన్‌ను పెంచుతున్నాయి.
మరి అఖిల్ కోసం బోయపాటి ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు? అఖిల్‌కు కొత్త మాస్ ఇమేజ్‌ను తీసుకొస్తాడా? లేక మరోసారి భారీ అంచనాల మధ్య బోల్తా పడతారా? అన్నది తెలియాలంటే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








