రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తొలుత ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను కథానాయికగా ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోగా.. ‘యానిమల్’తో భారీ క్రేజ్ తెచ్చుకున్న త్రిప్తి డిమ్రిని హీరోయిన్గా తీసుకున్నారు.
అంతేకాదు.. త్రిప్తి డిమ్రి లుక్‌ను ప్రభాస్‌తో కలిసి ఫస్ట్ లుక్ పోస్టర్లోనే రివీల్ చేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో దీపికా ‘స్పిరిట్’ నుంచి తప్పుకోవడం వెనుక అసలు కారణం ఏమిటన్న దానిపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సందీప్ రెడ్డి వంగా, దీపికా టీమ్ మధ్య జరిగిన మాటల యుద్ధం కూడా హాట్ టాపిక్‌గా మారింది.
దీపికాకు కథ నచ్చింది.. కానీ షరతులే సమస్య?
తాజాగా ఈ వ్యవహారంపై ‘స్పిరిట్’ సహ నిర్మాత, సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా స్పందించారు. దీపికాతో దాదాపు ఏడాదిన్నర పాటు చర్చలు జరిగినట్లు ఆయన వెల్లడించారు.
సందీప్ రెడ్డి వంగా.. కథ, పాత్ర గురించి దీపికాతో చాలాకాలం చర్చలు జరిపారని, నిజానికి ఆమెకు ‘స్పిరిట్’ కథ బాగా నచ్చిందని ఆయన తెలిపారు. అయితే కొన్ని వ్యాపారపరమైన షరతుల విషయంలో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పారు.
భారీ రెమ్యునరేషన్.. లాభాల్లో 10 శాతం వాటా?
ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. దీపికా భారీ రెమ్యునరేషన్‌తో పాటు సినిమా లాభాల్లో 10 శాతం వాటాను కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా షూటింగ్‌కు సంబంధించిన రోజువారీ పని గంటల విషయంలో కూడా ఆమె కొన్ని షరతులు పెట్టినట్లు ఆయన తెలిపారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాకు ఈ నిబంధనలు అనుకూలంగా ఉండవని భావించిన మేకర్స్.. చివరకు పరస్పర అంగీకారంతో మరో హీరోయిన్ను ఎంపిక చేసుకున్నట్లు ఆయన వివరించారు. దీంతో దీపికా సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారనే దానిపై ఇప్పటివరకు సాగుతున్న ఊహాగానాలకు ప్రణయ్ రెడ్డి వంగా వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరతీశాయి.
ముగిసిన ‘స్పిరిట్’–దీపికా వివాదం?
ఇక ప్రస్తుతం ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనుండగా.. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
దీపికా ‘స్పిరిట్’ నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు, దీపికా టీమ్ స్పందన.. ఇలా గతంలో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదంపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా లాభాల్లో 10 శాతం వాటా డిమాండ్ చేసిందన్న అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.









