అందాలతార అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, అభినయంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. గతంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఓ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించానని అప్పట్లో చెప్పిన అనుపమ.. తాజాగా ఆ బంధంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
బ్రేకప్‌పై స్పందించిన అనుపమ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గత రిలేషన్షిప్ గురించి అనుపమ పలు కీలక విషయాలను వెల్లడించారు. తాను దాదాపు రెండేళ్ల పాటు టాక్సిక్ రిలేషన్లో ఉన్నానని, ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు.
అంతేకాదు.. ఆ బంధం నుంచి బయటకు రాకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అనుపమ చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ రిలేషన్లో తాను అనుభవించిన ప్రతి క్షణం నరకంలా అనిపించిందని ఆమె పేర్కొన్నారు.
నార్సిసిస్టిక్ అబ్యూజ్‌కు గురయ్యానంటున్న అనుపమ
తన మాజీ భాగస్వామి నుంచి నార్సిసిస్టిక్ అబ్యూజ్ ఎదుర్కొన్నానని అనుపమ వెల్లడించారు. ఇలాంటి వేధింపులకు లింగభేదం ఉండదని.. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న చాలామంది దాన్ని గుర్తించలేకపోతున్నారని ఆమె అన్నారు.
తనకు జరిగిన అనుభవం నుంచి బయటపడిన తర్వాతే ఇలాంటి రిలేషన్షిప్లో కొనసాగడం ఎంత ప్రమాదకరమో అర్థమైందని అనుపమ తెలిపారు.
ఒకరోజు ప్రేమ.. మరుసటి రోజు క్రూరత్వం
నార్సిసిస్టిక్ అబ్యూజ్లో ఒక వ్యక్తి ప్రవర్తన ఎలా మారుతుందో కూడా అనుపమ వివరించారు. ఒకరోజు ఎంతో ప్రేమగా, తనపై ప్రపంచంలోనే అత్యంత ప్రేమ ఉన్న వ్యక్తిలా ప్రవర్తిస్తాడని.. అదే వ్యక్తి మరుసటి రోజు పూర్తిగా అపరిచితుడిలా మారిపోయి తీవ్ర నిర్లక్ష్యంతో, క్రూరంగా వ్యవహరిస్తాడని చెప్పారు.
ఆ తర్వాత మళ్లీ తన తప్పును అంగీకరించి చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఇకపై అలా చేయనని హామీ ఇస్తాడని.. కానీ కొంతకాలానికి అదే పరిస్థితి మళ్లీ పునరావృతమవుతుందని అనుపమ తెలిపారు. ఇలా ప్రేమ, కోపం, వేధింపులు, క్షమాపణలు అంటూ ఒక సైకిల్లా కొనసాగుతుందని ఆమె వివరించారు.
ఈ టాక్సిక్ రిలేషన్ కారణంగా తాను మానసికంగా ఎంతో కుంగిపోయానని కూడా అనుపమ చెప్పుకొచ్చారు. చివరకు అలాంటి బంధంలో కొనసాగడం తనకు సరైనది కాదని భావించి బయటకు వచ్చినట్లు తెలిపారు.
ఆ యువ హీరోతో ప్రేమలో ఉన్నారంటూ గతంలో వార్తలు
ఇక అనుపమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గతంలో పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తమిళ నటుడు ధృవ్ విక్రమ్‌తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరిగింది.
అయితే వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే ఆ వార్తలను ఖండించలేదు కూడా. ఈ నేపథ్యంలో అనుపమ తాజాగా చేసిన టాక్సిక్ రిలేషన్ కామెంట్స్‌తో మరోసారి ఆమె వ్యక్తిగత జీవితం గురించి చర్చ మొదలైంది.
అయితే ఆమె తన మాజీ భాగస్వామి పేరును మాత్రం వెల్లడించలేదు. దీంతో అసలు ఆ రిలేషన్ ఎవరితో అనే విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లలో ఆసక్తి మరింత పెరిగింది.








