‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే తన అందం, స్టైల్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి ‘కింగ్డమ్’ సినిమాలో నటించిన ఈమె, చివరగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా విజయాన్ని సాధించకపోయినా, తన ప్రతిభతో మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవల మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీకు మంచి బ్రేక్ లభించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ముఖ్యంగా అఖిల్, భాగ్యశ్రీ ఇద్దరికీ ఇది తొలి 100 కోట్ల సినిమా కావడం విశేషం.
‘లెనిన్’ సినిమాలో గ్లామర్‌తో పాటు తన నటనతో యువతను ఆకట్టుకున్న భాగ్యశ్రీకు ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి ‘సెయాన్’ అనే చిత్రంలో నటిస్తున్న ఈమెకు తాజాగా మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘బ్లడీ రొమియో’లో హీరోయిన్‌గా నటించేందుకు భాగ్యశ్రీని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సుజీత్ రాసుకున్న కథ, తన పాత్ర నచ్చడంతో భాగ్యశ్రీ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
నాని – సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక నాని విషయానికి వస్తే, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ, డైలాగ్స్ స్పష్టంగా అర్థం కావడం లేదని కొంతమంది విమర్శిస్తున్నారు.
దీనిపై స్పందించిన మేకర్స్ ఆగస్టు 8న మరో వీడియో విడుదల చేశారు. అయినప్పటికీ, సినిమా విడుదలకు ముందే డైలాగ్స్ మరింత క్లారిటీతో ఉండేలా మార్పులు చేయాలని ప్రేక్షకులు సూచిస్తున్నారు.








