నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’లో శూర్పణఖ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్ర ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా శూర్పణఖను ఒకే సంఘటనతో గుర్తుంచుకుంటారని, కానీ ఆ పాత్రలో దాగి ఉన్న లోతు చాలా ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపింది. అలాంటి సంక్లిష్టమైన పాత్రలు నటిగా తనకు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటాయని వెల్లడించింది.
ఇటీవల ఒక అభిమాని రకుల్‌కు బహిరంగ లేఖ రాస్తూ, శూర్పణఖ పాత్రను అంగీకరించినందుకు అభినందించారు. రామాయణంలో ఈ పాత్రను చాలామంది ఒక సంఘటనతో మాత్రమే గుర్తుపెట్టుకున్నా, కథను మలుపు తిప్పిన కీలక పాత్రల్లో శూర్పణఖ ఒకరని పేర్కొన్నారు. అలాంటి పాత్రను ఎంపిక చేయడానికి మీకు ప్రేరణ ఏమిటి? అని ప్రశ్నించారు.
ఈ లేఖకు రకుల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ, శూర్పణఖ పాత్రలోని భావోద్వేగ గాఢతే తనను ఎక్కువగా ఆకర్షించిందని చెప్పింది. చరిత్ర ఆమెను ఒక కోణంలో మాత్రమే చూపించినా, ఆమె కథలో ఎన్నో పరిమళాలు ఉన్నాయని పేర్కొంది. ప్రేక్షకుల అభిప్రాయాలను సవాలు చేసే పాత్రల్లో నటించడం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపింది.
‘రామాయణ’ విడుదలైన తర్వాత శూర్పణఖ పాత్రను ప్రేక్షకులు కొత్త కోణంలో అర్థం చేసుకుంటారని రకుల్ ఆశాభావం వ్యక్తం చేసింది.
నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థలు, అలాగే యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ‘రామాయణ: పార్ట్–1’ వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.








