మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘విశ్వంభర’ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ త్వరలో రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని సమాచారం.
ఈ నేపథ్యంలో చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విడుదల తేదీపై అధికారిక ప్రకటనను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ విజువల్స్, ఫాంటసీ ఎలిమెంట్స్, చిరంజీవి పవర్‌ఫుల్ పాత్ర ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
ఇక విడుదల తేదీ ఇదే అయితే బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమవుతున్న రజనీకాంత్ ‘జైలర్ 2’ తర్వాతి రోజే ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే రెండు దిగ్గజ నటుల చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పటి నుంచే సినీ అభిమానుల్లో కనిపిస్తోంది.
అయితే విడుదల తేదీతో పాటు ఇతర వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.








