సుమంత్ ప్రభాస్ కొత్త సినిమాకు ఘనమైన ప్రారంభం.. పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ప్రాజెక్ట్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.10గా రూపొందనున్న కొత్త చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాతలు శ్రీ పుష్కూర్ రామ్మోహన్ రావు, శ్రీ భరత్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ సాయిలు కాంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో చిత్ర యూనిట్‌తో పాటు సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదానంద్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందించగా, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. యంగ్ హీరో అడివి శేష్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, దర్శకుడు సాయిలు కాంపాటి తొలి సన్నివేశాన్ని తెరకెక్కించారు.
‘మేమ్ ఫేమస్’ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సుమంత్ ప్రభాస్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. చిన్న పట్టణం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా రూపొందనున్న ఈ సినిమాలో ఆయన ఉత్సాహంగా, సరదాగా ఉండే యువకుడి పాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.
ఆహ్లాదకరమైన ప్రేమకథతో పాటు వినోదానికి పెద్దపీట వేస్తూ రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ‘మేమ్ ఫేమస్’ తర్వాత సుమంత్ ప్రభాస్ నటిస్తున్న ఈ కొత్త చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.








