సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోలు కొత్త విషయం కాదు. ఎన్టీఆర్, ఎంజీఆర్‌ల నుంచి చిరంజీవి, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ వరకు ఎందరో తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు ఘన విజయం సాధిస్తే, మరికొందరు ఆశించిన ఫలితం రాక వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
అయితే ఇటీవల దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత మరోసారి సినీ ప్రముఖుల రాజకీయ ప్రవేశంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా స్టార్ హీరోలు వరుసగా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ అభిమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే వాటిపై ఆయన వ్యక్తిగత మేనేజర్ స్పందించి అవన్నీ కేవలం రూమర్లేనని స్పష్టం చేయడంతో ఆ ప్రచారానికి తెరపడింది.
ఇప్పుడు ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని, అందుకు జూలై 18న ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రకటన చేయనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన తారక్, తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండటం తెలిసిందే. దీంతో ఈసారి వస్తున్న వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
అయితే ఈ ప్రచారంపై తాజాగా తారక్ టీమ్ అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. జూలై 18న రాజకీయ ప్రకటన ఏదీ ఉండదని, ఆ రోజు తారక్ చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న “ఊరు–వాడ” అనే సోషల్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని మాత్రమే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఉపయోగపడే అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని తారక్ టీమ్ స్పష్టం చేసింది. అలాగే కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం, ఇతర వివరాలను త్వరలోనే తారక్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటిస్తారని తెలిపింది. కాబట్టి రూమర్లను నమ్మి ఎలాంటి అపోహలకు గురికావద్దని అభిమానులకు సూచించింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్లు కూడా త్వరలో రానున్నాయి.
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతున్న తారక్… భవిష్యత్తులో నిజంగానే రాజకీయాల్లోకి అడుగుపెడతాడా? లేక పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెడతాడా? అనే ప్రశ్న మాత్రం అభిమానుల్లో ఇంకా ఆసక్తిగానే మిగిలిపోయింది.








