సినిమా ఇండస్ట్రీలో దేవుళ్ల నేపథ్యంతో తెరకెక్కే చిత్రాలు కొత్తేమీ కాదు. శివుడు, శ్రీ వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి వంటి దేవతల ఆధారంగా ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇప్పుడు ఒకే దేవుడి చుట్టూ రెండు పెద్ద ఇండస్ట్రీల్లో ఒకేసారి భారీ సినిమాలు ప్రకటించబడటంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆ దేవుడు మరెవరో కాదు… మురుగన్, అంటే కార్తికేయ స్వామి.
ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. కార్తికేయ స్వామి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు ప్రచారంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే కోలీవుడ్ నుంచి మరో భారీ సర్ప్రైజ్ వచ్చింది. నేషనల్ అవార్డు విన్నింగ్ కాంబినేషన్ అయిన ధనుష్, వెట్రిమారన్ మరోసారి చేతులు కలిపి ‘తమిళ్ మురుగన్’ అనే సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన తెచ్చుకుంటోంది.
గతంలో ‘పొల్లాదవన్’, ‘ఆడుకాలం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను అందించిన ఈ జోడీ… ఇప్పుడు ఐదోసారి కలిసి వస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.
గ్లింప్స్‌లో యుద్ధభూమిలో వేలాది మంది సైనికుల మధ్య భారీ ఏనుగుపై యోధుడిలా కూర్చున్న ధనుష్ లుక్ ఆకట్టుకుంటోంది. సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ విజువల్స్‌కు మరింత బలం చేకూర్చింది. వండర్‌బార్ ఫిలిమ్స్, మైల్స్ టు గో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరివుమతి కథ అందిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ రెండు సినిమాల ప్రకటనల వెనుక మరో ఆసక్తికరమైన వివాదం కూడా నడుస్తోంది.
‘గాడ్ ఆఫ్ వార్’ పోస్టర్ విడుదలైన సమయంలో నిర్మాత నాగవంశీ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కార్తికేయుడు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చాడనే భావన వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మురుగన్ వేల ఏళ్లుగా తమిళుల ఆరాధ్య దైవమని, ఆయనకు తమిళ సంస్కృతితో విడదీయరాని అనుబంధం ఉందని నెటిజన్లు స్పందించారు.
ఈ వివాదం కొనసాగుతుండగానే ధనుష్ తన సినిమా ప్రకటనలో “ది ఎటర్నల్ ప్రొటెక్టర్… వారియర్… తమిళ ప్రజల నేలకు రాజు… తమిళ్ మురుగన్” అనే క్యాప్షన్ ఉపయోగించడం మరింత చర్చకు దారితీసింది. దీంతో ఇది కేవలం సినిమా ప్రకటన మాత్రమేనా? లేక ఇప్పటికే నెలకొన్న వివాదానికి పరోక్ష సమాధానమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరోవైపు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే యూనివర్సల్ టైటిల్ ఉండగా, ధనుష్ మాత్రం ‘తమిళ్ మురుగన్’ అనే ప్రాంతీయ భావోద్వేగాన్ని ప్రతిబింబించే టైటిల్‌ను ఎంచుకోవడం కూడా చర్చనీయాంశమైంది.
నిజానికి ఈ రెండు చిత్రాల కథలు, నేపథ్యాలు పూర్తిగా వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ నాగవంశీ ట్వీట్, ఆ తర్వాత ధనుష్ సినిమా టైటిల్, ప్రచార శైలి కలిసి ఇప్పుడు టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అనే చర్చకు తెరలేపాయి.
అసలు ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక రెండు ఇండస్ట్రీల మధ్య సైలెంట్ పోరా? ఈ మురుగన్ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.








