పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై దర్శకుడు హరీష్ శంకర్ భారీ అంచనాలను పెంచేశారు. ఇటీవల జరిగిన ‘కాలరే ఎత్తరా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. సినిమాలో సెకండాఫ్ లో వచ్చే ఒక ఇంటెన్స్ సీన్ సినిమాకే హైలెట్ అని, అందులో పవన్ పెర్ఫార్మెన్స్ చూసి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఎలివేషన్ డైలాగులు లేదా ఫైట్ల కోసమే తాను ఈ మాట చెప్పడం లేదని, పవన్ ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి పనిచేశారని ఆయన పేర్కొన్నారు.
సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదలైన ‘కాలరే ఎత్తరా’ మాస్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ పవర్ స్టార్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉందని, కాసర్ల శ్యామ్ లిరిక్స్ పవనిజం రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాటలో హరీష్ శంకర్ హీరోయిన్ రాశీ ఖన్నాతో కలిసి స్టెప్పులేయడం విశేషం. టైమ్ లైన్ సరిపోకపోవడం వల్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) బాధ్యతలను థమన్ నిర్వహిస్తున్నట్లు దర్శకుడు స్పష్టం చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. రన్ టైం 2 గంటల 33 నిమిషాలుగా ఖరారైంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో తమిళ నటుడు పార్తీబన్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ నెల 14న ట్రైలర్ రిలీజ్ కానుండగా, 19న ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.









