పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య హర్మూజ్ జలసంధి వద్ద పెను ప్రమాదం సంభవించింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన వ్యూహాలను మార్చుతూ, చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఈ క్రమంలో, గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు క్రూడాయిల్‌తో వస్తున్న ‘మయూరీ నారీ బ్యాంకాక్’ అనే థాయ్‌లాండ్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడికి తామే బాధ్యులమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారికంగా ప్రకటించింది.
ఒమన్ తీరానికి సమీపంలో జరిగిన ఈ దాడిలో 170 మీటర్ల పొడవున్న ఈ భారీ నౌక మంటల్లో చిక్కుకుని సగం కాలిపోయింది. క్షిపణి తగలగానే నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న థాయ్‌లాండ్ నౌకాదళం మరియు అంతర్జాతీయ తీరప్రాంత అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బందిలో 20 మందిని సురక్షితంగా రక్షించగా, మరో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ దాడి అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఖలీఫా పోర్టులో చమురు నింపుకుని భారత్‌కు బయలుదేరిన ఈ నౌకపై దాడి జరగడంతో, ప్రస్తుతం మరో రెండు కార్గో నౌకలు కూడా భద్రతా కారణాలతో అదే జలసంధిలో చిక్కుకుపోయాయి. ఇరాన్ తన హెచ్చరికలను ధిక్కరించి ప్రయాణించే ఏ నౌకనైనా వదిలేది లేదని, అవసరమైతే సముద్రంలో మైన్లను కూడా మోహరిస్తామని స్పష్టం చేయడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిణామం వల్ల భారత్‌కు చమురు మరియు గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.








