అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఇరాన్ ఊహించని రీతిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల ప్రభావంతో గల్ఫ్ దేశాలైన దుబాయ్, రియాద్, అబుదాబీ, దోహా నగరాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.
భద్రతా కారణాల దృష్ట్యా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అల్ ముక్తమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేసి, అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. అలాగే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను సైతం ముందుజాగ్రత్త చర్యగా ఖాళీ చేయించారు. నగరవ్యాప్తంగా భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని, భవనాలు కంపించాయని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దాడుల్లో అబుదాబిలో ఒక ఆసియా పౌరుడు మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అమెరికా ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ అని పేరు పెట్టగా, ఇరాన్ తన మిత్రదేశాల సాయంతో ప్రతిదాడులను ముమ్మరం చేసింది. పరిస్థితి విషమించడంతో పలు దేశాలు తమ గగనతలాన్ని (Airspace) మూసివేసి, ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి.









