ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో మీడియాతో మాట్లాడిన ఆయన, న్యాయస్థానం తీర్పును స్వాగతించారు. న్యాయవ్యవస్థే అత్యున్నతమైనదని, కోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలని ఆయన స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఈ కేసులో ఎటువంటి తప్పు చేయలేదని కోర్టు విశ్వసించినప్పుడు ఆ నిర్ణయాన్ని అంగీకరించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన మాజీ శిష్యుడైన కేజ్రీవాల్‌కు అన్నా హజారే కొన్ని కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా కేవలం పార్టీ గురించి కాకుండా, సమాజం మరియు దేశం కోసం నిస్వార్థంగా పనిచేయాలని కేజ్రీకి సలహా ఇచ్చారు. గతంలో కేజ్రీవాల్‌పై తాను చేసిన విమర్శల గురించి ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో కోర్టు నుంచి ఎటువంటి తీర్పు రాలేదని, ఆనాటి పరిస్థితుల ఆధారంగా తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. న్యాయవ్యవస్థ బలంగా ఉండటం వల్లే దేశం సరైన దారిలో నడుస్తోందని, లేకుంటే నేరస్తులే రాజ్యమేలేవారని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో అతిపెద్ద ప్రజా పోరాటంగా నిలిచిన జన్ లోక్‌పాల్ ఉద్యమం ద్వారానే కేజ్రీవాల్ ప్రజల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. అన్నా హజారే నాయకత్వంలో జరిగిన ఆ ఉద్యమంలో కేజ్రీవాల్ చురుకైన పాత్ర పోషించారు. అరెస్టైన సమయంలో హజారే తన శిష్యుడిపై అధికార దాహం, అవినీతి ఆరోపణల విషయంలో విమర్శలు చేసినప్పటికీ, తాజా తీర్పు తర్వాత కేజ్రీవాల్, సిసోడియాలు తన కార్యకర్తలేనని ఆయన ఆత్మీయంగా చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలను నిరూపించే ఆధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.









