టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఈ కొత్త జంట తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో అభిమానులు లైకులు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ “నా బెస్ట్ ఫ్రెండ్‌ను భార్యగా చేసుకున్నాను” అని పెట్టిన పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంది.
ఈ వివాహ ప్రకటన సోషల్ మీడియాలో గతంలో ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాసింది. విజయ్ పోస్ట్‌కు 13 మిలియన్లు, రష్మిక పోస్ట్‌కు 15 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా, మొత్తంగా ఈ జంట పెళ్లి పోస్టులకు 28 మిలియన్లకు పైగా వ్యూస్ లభించడం విశేషం. భారతీయ సెలబ్రిటీల వివాహ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని మిలియన్ల వ్యూస్ సాధించడం ఒక అరుదైన రికార్డుగా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వీరిద్దరి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలే నిరూపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ నూతన దంపతులు ‘రణబాలి’ అనే పీరియడ్ యాక్షన్ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. పెళ్లి వేడుకల అనంతరం వీరిద్దరూ ఉదయ్‌పూర్ నుండి బయలుదేరిన వీడియోలు కూడా ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీరి పెళ్లి రిసెప్షన్ వేడుకను మార్చి 4న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.








