ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాకు చెందిన ‘సేన్’ సామాజిక వర్గం పెద్దలు ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంగేజ్‌మెంట్ (నిశ్చితార్థం) పూర్తయిన తర్వాత, పెళ్లి జరిగే వరకు కాబోయే వధూవరులు ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకోవడం లేదా చాటింగ్ చేయడంపై పూర్తి నిషేధం విధించారు. ఒకవేళ ఏదైనా అత్యవసరమై మాట్లాడుకోవాల్సి వస్తే, ఖచ్చితంగా తల్లిదండ్రుల సమక్షంలోనే మాట్లాడాలని నిబంధన పెట్టారు. సుమారు 2.5 లక్షల జనాభా ఉన్న ఈ ఓబీసీ సామాజిక వర్గం, తమ కులంలో పెళ్లిళ్లు అర్ధాంతరంగా ఆగిపోకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ నిషేధానికి గల కారణాలను సామాజిక వర్గ ప్రతినిధులు వివరిస్తూ.. నిశ్చితార్థం తర్వాత యువతీయువకులు గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుకోవడం వల్ల చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు వస్తున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల పెళ్లి వరకు వెళ్లకుండానే సంబంధాలు తెగిపోతున్నాయని, ఇది రెండు కుటుంబాల గౌరవానికి మరియు ఆర్థిక స్థితికి నష్టం కలిగిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే కాకుండా, ఇప్పటికే ఈ వర్గంలో ‘ప్రీ వెడ్డింగ్ షూట్స్’ను కూడా నిషేధించారు. అలాగే పెళ్లిళ్లలో సరదాగా చేసే ‘బావ బూట్లు దాచిపెట్టే’ సంప్రదాయం కూడా ఘర్షణలకు దారితీస్తోందని దాన్ని కూడా రద్దు చేశారు.
అయితే, ఈ నిర్ణయంపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని యువతీయువకులు వాదిస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తి గురించి పెళ్లికి ముందే పూర్తిగా తెలుసుకోవడం అవసరమని, మనస్తత్వాలు కలవని వారు పెళ్లి తర్వాత విడిపోయి విడాకులు తీసుకోవడం కంటే, ముందే విడిపోవడం మేలని కొందరు జర్నలిస్టులు, విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక కట్టుబాట్ల పేరుతో ప్రాథమిక హక్కులను కాలరాయడం సరికాదని వారు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, ఆధునిక కాలంలో ఇటువంటి ఆంక్షలు అమలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.








