విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా మెగాఫోన్ పట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె స్వీయ దర్శకత్వంలో, ప్రధాన పాత్రలో నటించిన ‘సరస్వతి’ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ.. తెలుగులో తన కెరీర్ మలుపు తిరగడానికి కారణమైన దర్శకుడు గోపీచంద్ మలినేనిని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘క్రాక్’ సినిమాలో జయమ్మ పాత్రతో గోపీచంద్ తనకు రెండో జీవితాన్ని ఇచ్చారని, ఆ సినిమా తర్వాతే తెలుగు ప్రేక్షకులు తనను ఇంతలా ఆదరిస్తున్నారని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల పట్ల సమాజంలో ఉన్న కొన్ని అపోహలను వరలక్ష్మి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘సరస్వతి’ సినిమా కేవలం ఒక సందేశానికే పరిమితం కాకుండా, అత్యంత వేగంగా సాగే ఒక పక్కా థ్రిల్లర్ అని ఆమె స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో ఒక మహిళగా ఎదగడం, అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు వేయడం ఎంత కష్టంతో కూడుకున్నదో వివరిస్తూ, తన ప్రయత్నాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. మహిళా హక్కుల కోసం తాను ఎప్పుడూ గొంతు ఎత్తుతానని, ఈ సినిమాలో కూడా అదే పాయింట్‌ను శక్తివంతంగా చూపించామని వరలక్ష్మి వెల్లడించారు.
ఈ చిత్రాన్ని వరలక్ష్మి తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి నిర్మించగా, తమన్ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ చేసిన హీరో నాని, ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత బన్నీ వాసు చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తన మొదటి దర్శకత్వ ప్రయత్నంపై వరలక్ష్మి చూపిస్తున్న కసిని చూసి సినీ ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు.








