టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్యారెక్టర్ డిజైనింగ్, డైలాగ్ రైటింగ్ శైలిపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూరీ రాసే డైలాగులు, ఆయన మలిచే హీరో పాత్రలు అత్యంత సహజంగా, పవర్‌ఫుల్‌గా ఉంటాయని ప్రభాస్ కొనియాడారు. ముఖ్యంగా ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’ సినిమాల్లో తన పాత్రలను పూరీ డిజైన్ చేసిన తీరు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని, ఆయన రైటింగ్ స్టైల్‌ను అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదని ప్రభాస్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ్ గారి రైటింగ్ గురించి గొప్పగా వివరించారు. “బుజ్జిగాడు క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ ఆయన రాసిన విధానం చూసి షాక్ అయ్యాను. ఆ క్యారెక్టర్లో నేను ఎంతలా లీనమయ్యానంటే, బయట ఎవరితో మాట్లాడినా మర్చిపోయి బుజ్జిగాడిలాగే మాట్లాడేవాడిని. ఆయనలా క్యారెక్టరైజేషన్ రాసేవాడు ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరూ లేరు” అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.
పూరీ జగన్నాథ్ డైలాగుల పవర్ గురించి చెబుతూ ప్రభాస్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఏక్ నిరంజన్’ చిత్రంలోని విలన్ డైలాగ్స్ మరియు కొన్ని సీన్లు ఎంత బాగా వచ్చాయంటే, వాటిని హిందీ సూపర్ హిట్ సినిమా ‘దబాంగ్’లో వాడుకున్నారని తెలిపారు. నటుడు సోనూ సూద్ స్వయంగా పూరీకి ఫోన్ చేసి అడగగా, ఆయన ఎంతో కూల్‌గా పర్మిషన్ ఇచ్చేశారని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. పూరీ డైలాగులు నటుడి నోట విన్నప్పుడు అవి ఎంతో నేచురల్‌గా అనిపిస్తాయని, అది ఆయనకే సాధ్యమయ్యే మ్యాజిక్ అని ప్రభాస్ ఆకాశానికి ఎత్తేశారు.








