వైసీపీ హయాంలో సాగిన దందాలే నేడు కొనసాగుతున్నాయని, అందుకు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో జరుగుతున్న అక్రమాలే ఉదాహరణ అంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లాలో ప్రధానంగా అచ్చంపేట వద్ద ఉన్న మెడికొవర్ ఆసుపత్రిపై మంగళగిరిలో ఉన్న ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కార్యాలయంలో బుధవారం ఆయన నేరుగా ఫిర్యాదు చేశారు. బాధితులతో పాటు వెళ్లిన ఆయన కాకినాడలో మెడికొవర్ ఆసుపత్రిలో దారుణమైన అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా తాను వీటిని బయటపెట్టానన్నారు. ముఖ్యంగా ఇటువంటి ఆసుపత్రుల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ వంటి ప్రభుత్వం సంబంధిత సేవలు విషయంలో వాటి అమలుపై టాస్క్ ఫోర్స్ లాంటి బృందాన్ని ఏర్పాటు చేయాలని వర్మ సూచించారు.








