యాన్సెన్ ధాటికి కివీస్ కట్టడి
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ (31), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (48) ధాటిగా ఆడి కివీస్‌కు మంచి స్కోరు అందించేలా కనిపించారు. అయితే, దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో యాన్సెన్ కీలక సమయాల్లో వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బతీశాడు. యాన్సెన్ తన కోటా 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలకు ఓపెనర్లు క్వింటన్ డి కాక్, రికెల్టన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలోనే జట్టు స్కోరును 83 పరుగులకు చేర్చి విజయాన్ని సులభతరం చేశారు. అనంతరం కెప్టెన్ అయిడెన్ మార్క్రమ్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మార్క్రమ్ విధ్వంసంతో దక్షిణాఫ్రికా కేవలం 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
గ్రూప్-డిలో సఫారీ పట్టు
ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి హ్యాట్రిక్ కొట్టింది. ఈ గెలుపుతో గ్రూప్-డి పాయింట్ల పట్టికలో సఫారీలు తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లోనూ కివీస్‌ను ఓ ఆటాడుకున్న సఫారీలు, టోర్నీలో ఫేవరెట్‌గా దూసుకుపోతున్నారు. మరోవైపు ఈ ఓటమి న్యూజిలాండ్ సెమీస్ ఆశలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.









